వామ్మో.. వాళ్ల ముందు జగన్ కి డిపాజిట్లు గల్లంతు

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇప్పటికీ చాలామంది ఏడుస్తుంటారు. అమ్మఒడి ఎందుకు, చేయూత ఎందుకు, నేతన్న నేస్తం ఎందుకు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం ఎందుకు.. అంటూ ప్రశ్నిస్తుంటారు. అసలిలాంటి పథకాల వల్లే…

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇప్పటికీ చాలామంది ఏడుస్తుంటారు. అమ్మఒడి ఎందుకు, చేయూత ఎందుకు, నేతన్న నేస్తం ఎందుకు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం ఎందుకు.. అంటూ ప్రశ్నిస్తుంటారు. అసలిలాంటి పథకాల వల్లే ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. 

అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని లెక్కలోకి తీసుకుంటే.. ఆయా రాష్ట్రాల్లో నేతలు గుప్పిస్తున్న ఎన్నికల హామీల ముందు జగన్ లెక్కలోకి కూడా రారు అనే చెప్పాలి. నిజంగా సంక్షేమ కార్యక్రమాల వల్లే ఏపీ అప్పులపాలయితే.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలులో పెడితే.. రాష్ట్ర బడ్జెట్ 3 నెలలకి కూడా సరిపోదు. వాళ్లందరితో పోల్చి చూస్తే జగన్ చాలా బెటర్ అనుకోవాల్సిందే.

కేజ్రీవాల్ లెక్కలే వేరు..

నిరుద్యోగులకు 3వేల రూపాయల భృతి, 18 ఏళ్లు దాటిన అమ్మాయిలందరికీ నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం, ఉచిత కరెంటు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేజ్రీవాల్ అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలకు గోవా రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. తొలిసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుప్పిస్తున్న వరాలు కళ్లుచెదిరేలా ఉన్నాయి.

పంజాబ్ లో కూడా ఇంచుమించు ఇలాంటి హామీలే ఇచ్చారు కేజ్రీ. ఆయన దూకుడు చూసి అటు కాంగ్రెస్ కూడా ముందుగానే అందరికీ స్కూటర్ల హామీ ఇచ్చేసింది. వీరిని చూసి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలకు ముందే యువతకు సెల్ పోన్లు, ట్యాబ్ లు ఇచ్చి ఆకట్టుకున్నారు.

10లక్షలు ఇస్తున్నాం..

ఓటుకి 2వేల రూపాయలకు ఆశపడి వైరిపక్షాలకు ఓటు వేస్తారా లేక మేం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల ద్వారా వచ్చే 10లక్షల రూపాయలు తీసుకుంటారా అంటూ నేరుగా ఓటర్లనే అడిగేస్తున్నారు కేజ్రీవాల్. 

గోవా ఎన్నికల హామీల్లో ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేట్టు పథకాలు రూపొందించారు. ఓటుకి నోటు కావాలో, ఓటు వేసిన తర్వాత నోట్ల కట్టలే కావాలో మీరే తేల్చుకోండని చెబుతున్నారు.

వాళ్ల ముందు జగన్ ఎంత..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీల ముందు.. జగన్ నవరత్నాల ఖర్చు ఓ మూలకి కూడా రాదు. ఆమాటకొస్తే అసలు జగన్ ఇచ్చినవి పెద్ద హామీలే కావనుకోవాలి. కానీ ఇచ్చిన హామీలకు కట్టుబడి, ఎక్కడా ఏ ఒక్కరికీ లోటు రాకుండా ఆర్థిక కష్టాలున్నా తన తంటాలు తాను పడుతున్నారు జగన్. అలవిమాలిన హామీలు ఇచ్చారంటూ జగన్ పై అభాండాలు వేస్తున్నవారంతా.. మిగతా రాష్ట్రాల ఎన్నికల హామీలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరీ ముఖ్యంగా ఇప్పుడు హామీలు గుప్పిస్తున్న జనాల్లో చాలామంది చంద్రబాబు రాజకీయ స్నేహితులే ఉన్నారు. జగన్ పై చేసిన 'పప్పు-బెల్లం' విమర్శల్ని, చంద్రబాబు వాళ్లపై కూడా చేస్తారా? రాబోయే రోజుల్లో ఈ హామీల పోటీ మరింత పెరిగే అవకాశముంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేజీ బియ్యం రూపాయి అనడంతో పాటు, లీటర్ పెట్రోల్ 10 రూపాయలకే ఇచ్చేస్తామన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.