హ్యాపీనెస్ అంటే అదేదో జీవిత చరమాంకంలో చవి చూసేది కాదు. హ్యాపీనెస్ అనేది అనునిత్యం ఉండేది. ఇలాంటి ఆనందం ప్రతి ఒక్కరూ కోరుకునేదే. చిన్న చిన్నవే అనునిత్యం ఆనందాన్ని వెంట ఉంచగలవు. మరి అవేమిటనే అంశం గురించి అనేక అధ్యయనాలు కూడా జరిగాయి, జరుగుతూ ఉంటాయి.
ఈ అంశం గురించినే పరిశోధించి, మనిషిని ఆనందంగా ఉంచగల అంశాలను సూత్రీకరించింది హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ను ఇచ్చే నాలుగు సీక్రెట్స్ ఏవంటే!
గుడ్ ఫ్రెండ్స్!
ఆనందం పంచుకుంటే రెట్టింపు అవుతుందని అని ఒక సేయింగ్ ఉంది. ఆనందంగా ఉండాలంటే.. ఊసులను, బాసలను పంచుకోవడానికి మంచి స్నేహితులు చాలా కీలకం అని అంటోంది ఈ అధ్యయనం.
ప్రతి మనిషికీ రకరకాల బాధలుంటాయి. వాటి గురించి తన బాధనో, ఆవేదననో, ఇబ్బందినో చెప్పుకోవడానికి తగిన మనిషి అవసరం ఉంటుంది. అలా చెప్పుకోవడం వల్ల మానసికంగా కొంచెం భారం తగ్గుతుంది. అంతే కాదు.. ఇది నెర్వస్ సిస్టమ్ మీద కూడా ప్రభావం చూపిస్తుందట. ఇలాంటి స్నేహితులను కలిగి ఉండటం, వారితో తమ పరిస్థితి గురించి చెప్పుకోవడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుంది. దీని ఫలితంగా శారీరకంగా కూడా ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వయసు మీద పడే శారీరక పరిస్థితిని కూడా మంచి స్నేహాలు తగ్గించి వేయగలవట!
కుటుంబంతో గడపడం!
ఆనందకరమైన జీవితానికి రెండో రెసిపీ కుటుంబం. కుటుంబం .. తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే కాదు.. తోబుట్టువులు, కజిన్స్.. ఇలా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ, అడపాదడపా వారితో కలుస్తూ మాట్లాడటం, సరదాగా గడపటం ఉల్లాసకరమైన జీవితాన్ని ఇస్తుంది.
పండగకో, పబ్బానికో.. అయిన వారిని కలుస్తూ.. మాట్లాడుకోవడం కూడా జీవితంలో కీలకమైన విషయమే అని ఈ పరిశోధన చెబుతుంది. నేను, నా ఇల్లు అన్నట్టుగా కాకుండా.. భార్యా,పిల్లలతోనే కాకుండా.. కుటుంబీకులతో కూడా అప్పుడప్పుడైనా గడపం కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. హ్యాపీనెస్ కు ఫ్యామిలీ రూట్ అయితే,
ఫ్రెండ్స్ బ్రాంచెస్ లాంటి వాళ్లని అంటోంది.
అడిక్షన్స్ వద్దే వద్దు!
దేనికైనా అడిక్ట్ కావడం చాలా తేలిక. ఫుడ్, డ్రగ్స్, సిగరెట్స్, ఆల్కాహాల్… ఇంకా పోర్న్! ఇవన్నీ కూడా చాలా తేలికగా దొరికే పరిస్థితుల్లో కూడా వీటికి అడిక్ట్ కాకుండా ఉండటం చాలా మంచిది. అన్ని అలవాట్లకూ దూరంగా ఉండి, కట్టేసుకుని మునిలా గడపమని కాదు.. మన అలవాట్లను మనం డిసైడ్ చేయాలి కానీ, మన అలవాట్లు మనల్ని డిసైడ్ చేయకూడదు.
దేనికీ అడిక్ట్ కావొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి అలవాటు పడాలి, ఫ్రెండ్స్ ను కలవడానికి ప్రతి రోజూ కొంత సమయం కేటాయించవచ్చు, లాంగ్ బాత్ చేయొచ్చు.. ఇంకా వీలైతే ఏదైనా క్రియేటివ్ హ్యాబిట్ ను అలవరుచుకోవచ్చు. ప్రొడక్టివ్ గా థింక్ చేయొచ్చు. అయితే అడిక్షన్స్ కు మాత్రం దూరంగా ఉండటం హ్యాపీనెస్ కు కీలకమైన అంశం.
సెల్ఫ్ లవ్..
సెల్ప్ లవ్ అంటే.. నార్సిస్టిక్ గా ఉండమని కాదు. మనమంటే మనకు కొంత ప్రేమ ఉండాలి. మన కంపెనీని మనం ఆస్వాధించగలగాలి. ఇది సాధ్యం కాలేదంటే.. ఆనందంగా ఉండటం కూడా దాదాపు అసాధ్యం. ఎంతసేపూ ఎవరో ఒకరు పక్కన ఉండాలనే భావన సరి కాదు.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ ముఖ్యమేకావొచ్చు. వారందరి కన్నా మీతో మీరే ఎక్కువగా గడుపుతారు కాబట్టి.. మీకు మీరు నచ్చాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి. తగినంత నిద్రనివ్వాలి. ఫోన్లూ, ఇంటర్నెట్ సమయాన్ని తగ్గించాలి. ఇవి కూడా మీ ఆనందాన్ని నిర్దేశిస్తాయి.
వీటిని ప్రాక్టీస్ చేయడంతో పాటు సానుకూల ధోరణితో ఆలోచిస్తూ, ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండటం.. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కు కీలకమైన విషయాలు అనేది అధ్యయన సారాంశం.