కరోనా నివారణకు వ్యాక్సిన్ వస్తుందంటే… అదేదో ఒక ఇంజక్షన్ తో అయిపోతుందని చాలా మంది అనుకున్నారు మొదట్లో. అయితే మానవ శరీరాన్ని కరోనాను ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా తయారు చేయగల వ్యాక్సిన్ ఒక డోసు కాదని, విరామాలతో రెండు డోసులు పొందాల్సి ఉంటుందని వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన కొత్తలోనే పరిశోధకులు ప్రకటించారు. కీలకమైన విషయం ఏమిటంటే… యాంటీ కోవిడ్ వ్యాక్సిన్లను చాలా వేగంగా తయారు చేశారు.
కరోనా మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. అనేక దేశాల ప్రభుత్వాలు కూడా ఎడాపెడా వ్యాక్సిన్ల ప్రయోగాలకు పరిమితులు ఇచ్చేశాయి. ఒక వ్యాక్సిన్ తయారు చేయడం అంటే మాటలు కాదని, అనేక రకాల పరిశోధనలు అవసరమని వైరాలజిస్టులు, వ్యాక్సినోలజిస్టులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో.. ఎవ్వరూ వ్యాక్సిన్లను గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి!
ఏదైనా కొత్త తరహా వ్యాక్సిన్ తయారీకి రెండు మూడేళ్ల కనీస సమయం పడుతుందనే పరిశోధకుల మాటలు మరుగయ్యాయి. ఏడాదిలోనే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఆ వ్యాక్సిన్లను ప్రమోట్ చేశాయి. ప్రజలకు ఉచితంగా ఇచ్చాయి. ఒక్కోరు ఒక డోసు, రెండు డోసులు వేసుకోవాలన్నాయి. ఇండియాలో కూడా దాదాపు 90 శాతం వయోజనులు కనీసం ఒక డోసును, 70 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్లు పొందినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇంత జరిగినా.. ఇప్పుడు మళ్లీ లక్షల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వస్తున్నాయి.
దేశ జనాభాలో 70 శాతం మందికి కనీసం రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేస్తే ఆ తర్వాత కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోతుందన్న విశ్లేషణలు ఇప్పుడు వినిపించడం లేదు! వ్యాక్సినేషన్ సంగతలా ఉంటే.. అనేక మందికి ఆల్రెడీ ఒక సారి కరోనా వచ్చి ,తగ్గిపోయింది. ఇలాంటి వారి సంఖ్య కూడా కోట్లలో ఉంది. ఇలాంటి వారిలో ఇమ్యూనిటీ రావడం, మరోవైపు వ్యాక్సినేషన్ వల్ల.. ఇక కరోనాకు చెక్ పడినట్టే అన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ పాత నంబర్లు, అంతకు మించిన వేగంతో వస్తున్నాయి.
ఇప్పుడు పరిశోధకులు చెప్పే మాట.. ఈ సారి కరోనా ప్రభావం తక్కువ. వ్యాక్సిన్ల ఫలితంగా హాస్పిటలైజ్ అయ్యే వాళ్ల సంఖ్య తక్కువ అని. ఇదే నిజమైతే మంచిదే. అయితే ఇప్పుడు బూస్టర్లు వేసుకోవాలంటూ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. కేవలం ప్రచారం చేయడమే కాదు.. అమెరికాలో మూడో డోసును ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఇజ్రాయెల్ లో నాలుగో డోసు అయిపోయింది. ఇండియాలో అరవై యేళ్ల పై వారికి మూడో డోసు ఇస్తామంటున్నారు. వైద్య సిబ్బంది ఇప్పటికే మూడు డోసులను పూర్తి చేసుకుందనే వార్తలూ వస్తున్నాయి.
సరే.. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వేసుకుంటున్నారు. మరి వీటి వల్ల ప్రయోజనం ఎంత? అనే దిశగా ప్రయోగాలు, పరిశోధనలు సాగుతున్నాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్క వ్యాక్సిన్ తయారు చేసేందుకు , అది మానవ శరీరంపై స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి రెండు మూడేళ్లు ల్యాబుల్లోనే పరిశోధించాల్సి ఉంటుందని చెప్పిందీ పరిశోధకులే. మరి అలాంటి దీర్ఘకాలిక ప్రయోగాలు లేకుండా.. వచ్చిన వ్యాక్సిన్లను ఒక డోసు కాదు, రెండు డోసులు వేయించుకొమ్మన్నదీ ప్రభుత్వాలు, పరిశోధకులే. మరి రెండో డోసులు చాలవని,. మూడు, నాలుగు అని అంటున్నారు. రెండు డోసుల వల్ల ఏ మేరకు రక్షణ ఏర్పడుతుందో… ఇప్పటి వరకూ ప్రయోగాత్మక పరిశీలనలు ఎన్ని ఉన్నాయి?
రెండు డోసులు వేయించుకున్న తొంభై రోజుల తర్వాత కూడా కరోనా సోకిన వారు , ఓ మోస్తరు సింప్టమ్స్ చూసిన వారు కోకొల్లలు. అసలు వ్యాక్సినేషనే చేయించుకోకపోయినా కరోనా సోకి, చాలా తేలికగా బయటపడిన వారూ కోకొల్లలు. వ్యాక్సిన్ వేయించుకుంటే కచ్చితంగా కరోనా రాదు.. బయటపడదు.. అని ఎవ్వరూ చెప్పడం లేదు. బయట పడకపోతే మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా! అనే మాట అంటున్నారు.
మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తే.. మీకు వ్యాక్సిన్ పని చేసిందని అంటున్నారు తప్ప.. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లందరికీ మైల్డ్ సింప్టమ్సే అనే మాటా ఎవరూ గట్టిగా చెప్పడం లేదు! రెండు డోసుల వ్యాక్సినేషన్ అంటే.. అది ప్రభుత్వం చెప్పింది, ప్రజలకూ ఏదో నమ్మకం కావాలి. మరి మూడు, నాలుగు.. అంటూ.. వాదిస్తూ ఉంటే మాత్రం, వ్యాక్సిన్లపై ప్రజల్లోనే నమ్మకం సడలుతుంది.
వ్యాక్సిన్ల ప్రభావంపై సశాస్త్రీయమైన అధ్యయనాలను వాటి రూపకర్తలే చేయాలి. వ్యాక్సిన్ల అమ్మకాల ద్వారా కోట్ల డాలర్లను పోగేసుకుంటున్న సంస్థలు.. తమ వ్యాక్సిన్ల ప్రభావంపై కొంత ఖర్చు పెట్టి పరిశోధనలు సాగించి, ఈ పాటికే వాటి సత్తా ఏమిటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాల్సింది.