బాబు కుప్పం పర్యటనలో వుండగా జనసేనతో కలవాలని ఒక టిడిపి కార్యకర్త సూచించగా ఆయన ‘తమ్ముళ్లూ మనవైపు నుంచి ఎంత లవ్వున్నా, అవతలివైపు నుంచి కూడా ఉండాలి కదా’ అన్న కామెంట్ చర్చకు దారి తీసింది. ఏ నాయకుడూ అలా బయటకు చెప్పరు. పార్టీల మధ్య పొత్తులనేవి ఆఖరి నిమిషం దాకా తేల్చరు. గత ఎన్నికల్లో మాకిన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి, అప్పణ్నుంచి యింకా పెరిగాం కాబట్టి యిన్ని సీట్లు కావాలంటారు. అప్పటికంటె మీ బలం తగ్గింది కాబట్టి అన్ని యివ్వం అని ఎదుటివాళ్లు.. యిలా బేరసారాలు సాగుతాయి. లెఫ్ట్ పార్టీలతో అయితే వాళ్లు ఏ 50 దగ్గరో మొదలెడతారు. చివరకు 5 దక్కించుకుని, అవి కూడా గెలవలేక చతికిలపడతారు. సీట్ల సంఖ్య దగ్గరే కాదు, ఏ సీటు ఎవరికి అనే దాని దగ్గరా కొట్టుకుంటారు, చివరకు పొత్తు లేదు, ఎడ్జస్ట్‌మెంట్ మాత్రమే అనే సందర్భాలూ వుంటాయి. కొన్ని స్థానాల్లో స్నేహపూర్వకమైన పోటీ అంటూ యిద్దరూ పోటీ చేస్తారు. మధ్యమధ్యలో బిగువు చూపించడానికి ఒంటరిగా పోటీ చేస్తామంటూ పార్టీ ప్రముఖుల చేత స్టేటుమెంట్లు యిప్పిస్తారు.
ఇంత తతంగం జరగాల్సి వుండగా ఒక పెద్ద పార్టీ అధినేత ఇలాటి ఓపెన్ ఆఫర్ యిస్తాడా? మేం మీతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నాం, మీరే కరుణించలేదు అంటాడా? వేరెవరైనా యీ ప్రకటన చేస్తే తెలివితక్కువ ప్రకటన, మతి పోయిందాయనకు అంటూ మీడియా ఎద్దేవా చేసేది. ఆయన తెలివితక్కువగా చేసిన ప్రకటనలు లేకపోలేదు. కానీ యింత ముఖ్యమైన విషయంలో మాత్రం కాదు. అనాలోచితంగా బాబు నోరు జారారని అనుకోవడానికి లేదు. ఇది తప్పకుండా ప్లాంటెడ్ క్వశ్చనే. అదే కుప్పంలో జూనియర్‌ను పార్టీలోకి తేవాలని చేసిన నినాదాలకు ఆయన సమాధానం యివ్వలేదుగా! దీనికి యిచ్చారంటే దీనిపై చర్చ జరగాలనే ఉద్దేశంతోనే, ఆయన అడిగించుకున్నారు. ఈ ఒన్‌సైడ్ లవ్ స్టేటుమెంటులో చాలా రిస్కు వుంది. మనం వీక్‌గా వున్నామన్న సంకేతం వెళ్లి టిడిపి క్యాడర్ మొరేల్ దెబ్బ తింటుంది. ఊళ్లలో జనసేనవాళ్లు టిడిపి వాళ్లను మీరే మా వెంట పడుతున్నారని వెక్కిరించవచ్చు.
నిజానికి ఏకపక్షంగా ప్రేమించడంలో ఏ తప్పూ లేదు. గతంలో సినీహీరోలు హీరోయిన్‌ల వెంటపడి, పాటలు పాడి, పాట్లు పడేవారు. విఫలమైతే భగ్నప్రేమికులు, తాగుబోతులు అయిపోయేవారు. పోనుపోను అది హీరోయిజం కాదనే భావన వచ్చేసింది. ఇప్పుడు ఎంత అతిలోకసుందరైనా సరే, హీరో వెనక పడి, పెళ్లి చేసుకో, కనీసం శోభనం చేసుకో అని బతిమాలాల్సిందే. అందువలన బాబు తన ఏకపక్ష ప్రేమను బాహాటంగా వ్యక్తీకరించి యీనాటి నిర్వచనం ప్రకారం హీరోని కాదనిపించుకున్నారు. అవతలివాళ్లు జగదేక వీరులైతే మనం కాస్త తగ్గినా ఫర్వాలేదనుకోవచ్చు. కానీ జనసేన దగ్గరేముందని? టిడిపి ఓటుశాతంతో పోలిస్తే దాని ఓటుశాతం ఎంతని? టిడిపి నెట్‌వర్క్, మీడియా సపోర్టు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కార్యకర్తల బలం.. వీటిలో వేటితోను జనసేన పోటీ పడలేదు. అయినా బాబు తనను తాను తగ్గించుకుని ప్రకటన చేయడం వింతగా లేదూ!?
ఎన్నికల వేళ వచ్చేసరికి బాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పలేం. మొదటి ఆప్షన్ 2014 నాటి టిడిపి-బిజెపి-జనసేన కూటమి. అది అద్భుతంగా పనిచేసింది. 2019 వచ్చేసరికి ఎవరి పాటికి వాళ్లు పోటీ చేసి మూడూ నష్టపోయాయి కాబట్టి (జనసేనకు బిఎస్పీ, లెఫ్ట్‌తో పొత్తు వుందనుకోండి, ఓట్ల బదిలీ జరిగినట్లు కనిపించలేదు కాబట్టి, ఒంటరనే అనవచ్చు) యీసారి ముగ్గురూ మళ్లీ కలుద్దామని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పవన్‌కు లెఫ్ట్‌తో కంటె బిజెపితోనే ఎక్కువ దోస్తీ. ఇక టిడిపి కంటారా, అది ఒక విచిత్రమైన లోహం, ఎక్స్‌ట్రీమ్ రైట్ నుంచి, ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ దాకా, మజ్లిస్ నుంచి బిజెపి దాకా ఎవరితోనైనా కలవగలదు. బిజెపికి అర్ధబలం వుంది, జనసేనకు పవన్ గ్లేమరుంది. టిడిపి అర్ధబలంతో బాటు అంగబలం కూడా వుంది. ఇది 35-40 శాతం ఓట్లు తెచ్చుకోగల కాంబినేషనే!
కానీ దీన్ని మోదీ సాధ్యపడనిస్తారో లేదో తెలియదు. 2019 ఎన్నికల సమయంలో బాబు మోదీని వ్యక్తిగతంగా తిట్టారు వంటి కారణాలు పక్కన పెట్టినా, ఆంధ్రలో టిడిపిని పూర్తిగా కనుమరుగు చేస్తేనే బిజెపికి ఎదిగే అవకాశం వుంది. వైసిపి ప్రధాన ప్రత్యర్థి ఐన టిడిపియే ఎన్నికలలో ఓటమి తర్వాత పెద్దగా పుంజుకోలేక, నాయకులు యిళ్లలోంచి బయటకు కదలక, క్యాడర్ నిస్తేజమై వుంది. బాబు, లోకేశ్ పత్రికా ప్రకటనల్లో, వీడియో కాన్ఫరెన్సుల్లో, ట్విట్టర్‌లో చురుగ్గా వున్నారు తప్ప క్షేత్రస్థాయిలో కనబడటం లేదు. ఇలాటి టిడిపికి బిజెపి తన చేతులతో ఊపిరూదుతుంది? వైసిపి ద్వారా టిడిపిని తుదముట్టించి, ఆ తర్వాత దాని స్థానంలో అది ఎదుగుదామని చూస్తుంది.
ఈ లాజిక్ కారణంగా బిజెపితో పొత్తు వర్కవుట్ కాకపోతే బాబు టిడిపి-కాంగ్రెసు-లెఫ్ట్-జనసేన కూటమికై ప్రయత్నించవచ్చు. దానికి ఏ అవాంతరమూ కనబడదు కానీ దానివలన ప్రయోజనం పెద్దగా వుంటుందన్న నమ్మకం బాబుకి వుందనుకోలేము. స్థానిక ఎన్నికలు వీళ్ల బలాబలాల గురించి కొంత పిక్చర్ యిచ్చాయి కదా! సరే, టిడిపి కూటమి ఎలాటిదైనా సరే జనసేన కామన్ అనుకోవచ్చు. బాబు మాట కాదని పవన్ వేరే చోటకి వెళతారని అనుకోవడానికి లేదు. ఇప్పటికే అనేక చోట్ల జనసేన, టిడిపి సహకరించుకుంటున్నాయి. జనసేన జేబులో వుంటుందనే ధైర్యం వున్నపుడు యిప్పణ్నుంచే దాని ముందు సాగిలబడడం దేనికి? ఈ ప్రకటన తర్వాత వాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగిపోయి, ‘పవన్‌ను సిఎంగా ప్రకటిస్తేనే పొత్తు గురించి ఆలోచిస్తాం..’ అంటున్నారు కొందరు. అది జరిగే పనా? తను సిఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసిన బాబు వేరేవార్ని సిఎంగా ఒప్పుకుంటారా? అంతెందుకు లోకేశ్ సామర్థ్యంపై టిడిపి నాయకులకు సైతం నమ్మకం కానరాకపోయినా అతని స్థానంలో మరో నెంబర్ టూని కూడా తేవటం లేదే!
ఇంకో వాదన కూడా విన్నాను – బాబు ఓపెన్ ఆఫర్ యిచ్చినది బిజెపికి, జనసేనకు కాదు అని. ‘కహీపే నిగాహే, కహీ పర్ నిశానా’ అనే పాట వుంది. చూపు ఒకవైపు, గురి మరోచోట అని. జనసేనను ఉద్దేశించి అన్నా, అది బిజెపిని ఉద్దేశించిన వేడుకోలు అని కొందరంటున్నారు. ఎందుకంటే జనసేన దగ్గర పెద్దగా సరుకేమీ లేదు, బిజెపి వస్తే దానితో బాటు జనసేన ఎలాగూ వస్తుంది. బిజెపి మద్దతే ముఖ్యం. 2019 మోదీతో సున్నం పెట్టుకుని బాబు టిడిపి అవకాశాలను చెడగొట్టారని చాలామంది టిడిపి అభిమానులు యిప్పటికీ సణుగుతున్నారు. వారి లెక్క ప్రకారం ఎన్నికల సమయంలో నిధుల రవాణాపై బిజెపి పట్టు బిగించడం చేత టిడిపి చాలా నష్టపోయింది. ఈసారైనా మంచి చేసుకోవాలి. వాళ్లకు వ్యతిరేకంగా వెళితే టిడిపి మద్దతుదారులపై ఐటీ దాడులు, ఈడీ దాడులు.. యిలా తనకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శించి బిజెపి టిడిపిని అణిచేయవచ్చు. ఎలాగైనా మోదీతో రాజీపడు అని బాబుకి హితైషులు ఊదరగొట్టేస్తున్నారట.
బాబు ఆ మాట వింటున్నట్లే కనబడుతోంది. బిజెపిలో కొందరు టిడిపిని తిడుతున్నా టిడిపి మాత్రం కిమ్మనదు. వైజాగ్ స్టీలు ప్లాంట్ అమ్మేస్తున్నా, పెట్రోలు ధర పెరిగినా, హోదా, రైల్వే జోను వగైరాలకు గుండుసున్నా చుట్టినా, బజెట్‌లో రైల్వే లైన్లు కేటాయించకపోయినా అవన్నీ జగన్ తప్పిదాలుగానే చిత్రీకరిస్తుంది తప్ప కేంద్రాన్ని పన్నెత్తి మాట అనకుండా కాలక్షేపం చేస్తోంది. అయినా బిజెపి దిగి రావటం లేదు. ఇటీవల అమరావతి ఉద్యమంలో కలిసి వచ్చిందంటే, అది టిడిపిపై ప్రేమతో కాదు, ఆ ప్రాంతంలో బలపడాలనే కోరికతో మాత్రమే అనుకోవాలి. ఎన్నికలు రెండేళ్లలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడే పొత్తు ఖరారు చేసుకుంటే జాయింటుగా ఆందోళనలు చేస్తూ వుంటే టిడిపి నాయకుల్లో ఆశలు చిగురించి, క్యాడర్‌లో ఉత్తేజం కలుగుతుందనే లెక్కతోనే యీ బహిరంగ ప్రేమలేఖ రాశారని వాదన.
కానీ దీనితో నేను ఏకీభవించను. వెంకయ్య, సుజనా చౌదరి, సిఎం రమేశ్, రఘురామ వంటి హంసల ద్వారా రోజూ ప్రేమసందేశాలు బిజెపి అధిష్టానానికి బట్వాడా అవుతూనే వున్నాయి. కానీ ఆ కొమ్మ చెట్టుకొమ్మ దిగటం లేదు. ఈ ప్రకటన వలన రాష్ట్ర నాయకులు వెళ్లి అధిష్టానం దగ్గర ఒత్తిడి చేసేటంత సీను లేదు. ఎందుకంటే యిప్పటిదాకా రాష్ట్రనాయకులు తమంతట తాము సాధించినది ఏమీ లేదు. సొంత స్టేచరూ లేదు. మోదీ, అమిత్‌లు ఏం చెపితే అది విని తలూపాల్సిందే!
నా ఉద్దేశంలో యీ సందేశం జనసేనకే! ఉద్దేశమంటారా, పొత్తు కాదు, జనసేనను నిలువునా చీల్చడం! బాబు రాష్ట్ర బిజెపిని టిడిపి అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీల్చి దాన్ని నీరసింప చేశారు. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. ఇప్పటికే ఆ పార్టీలో రెండు రకాల ఆలోచనా ధోరణులున్నాయి. ఒక వర్గం ఆలోచన ప్రకారం ‘పవన్ బాబుకి అనుకూలుడైనా, టిడిపి వాళ్లతో కలిసి ఊరేగడం వలన మనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉభయతారకంగా వున్న చోట కలుస్తున్నాం కానీ ఓపెన్‌గా కాదు, ఓపెన్‌గా కలిస్తే బిజెపి ఊరుకోదు. పొత్తు అనేది సరిసమానుల మధ్య పొసుగుతుంది. టిడిపికి 2019లో వచ్చిన స్థానాలు 23, మనకు 1. ఓట్లశాతంలో పోలికే లేదు. అందువలన యీ పొత్తులో టిడిపి మనపాలిట పెద్దన్నలా తయారవ్వచ్చు.
పైగా బాబుతో పొత్తుతో బాగుపడినవాళ్లు లేరు. ఆయనది ధృతరాష్ట్ర కౌగిలి. లెఫ్ట్ పార్టీల సంగతి చూడండి. గతంలో కొన్ని సీట్లు, ఓట్లు వుండేవి. కాంగ్రెసుపై ద్వేషంతో టిడిపితో చేతులు కలిపిన తర్వాత క్రమేపీ క్షీణించి పోయింది. ఆ తర్వాత బిజెపి కూడా. విడిగా పోటీ చేస్తూ వచ్చి వుంటే, 2014 తర్వాత మోదీ గ్లామర్ పని చేసి ఎన్నో కొన్ని సీట్లు సొంతంగా వచ్చేవి. అన్నీ ఆయనే చూసుకుంటాడని బాబుకి వదిలేయడం వలన పార్టీ, అస్తిత్వం కోసం వెతుక్కోవలసి వస్తోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెసుతో చేతులు కలపడంతో బాబుపై ద్వేషం కాంగ్రెసుపై ప్రతిఫలించి, అదీ నష్టపోయింది. ఇప్పుడిక మన వంతు అవుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కమ్మ, కాపు విభేదాలున్నాయి. కమ్మలతో కలిశామనే కోపంతో కాపులు వైసిపివైపు తిరిగిపోతే మన ఓటు బ్యాంకు క్షీణించిపోతుంది. అందువలన విడిగావిడిగానే పోటీ చేసి, ఎన్నికల తర్వాత అవసరమైతే అధికారాన్ని పంచుకోవచ్చు’ అని వీరి వాదన.
కానీ కొందరు మరోలా ఆలోచిస్తారు. ‘మన పవన్ కళ్యాణ్ ఒక పవర్ హౌస్, ఒక ట్రాన్స్‌ఫార్మర్. తన మాటలతో, ఆలోచనలతో ఉత్తేజపరచగలడు. కానీ ఆ కరంటును ప్రజల దాకా చేర్చాలంటే పార్టీ నిర్మాణమనే తీగలు కావాలి. అవి లేకపోవడం చేతనే అభిమానించే ప్రజల్ని ఓటర్లగా మార్చలేకపోతున్నాం. పార్టీ పెట్టి ఏడేళ్లు దాటినా, పార్టీ నిర్మాణం గురించి తీర్మానాలు జరుగుతున్నాయి తప్ప పని జరగటం లేదు. ఏదైనా నియోజకవర్గంలో కార్యకలాపాలు జరుగుతున్నాయంటే అది స్థానిక నాయకుడి చొరవే తప్ప అధిష్టానం నుంచి ఆదేశాలు రావటం లేదు. అధినేత పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కరోనా టైములో కొన్ని చోట్ల మన వాలంటీర్లు ప్రజలకు సేవ చేసి గుడ్‌విల్ సంపాదించినా, స్థానిక ఎన్నికలలో దాన్ని ఓట్లగా మార్చుకునే యంత్రాంగం మనకు లోపించింది.
పవన్ సినిమాల్లో బిజీగా వున్నారు. ఒక దాని తర్వాత మరొక సినిమా ఒప్పుకుంటూ హీరోగా తన యిమేజి, మార్కెట్ పెంచుకునే పనిలోనే ఉన్నారు. దానివలన పవన్ అభిమానుల సంఖ్య పెరిగి, పార్టీకి మేలు జరుగుతుంది. కాపులే కాక యితర కులాల అభిమానులు కూడా పార్టీకి మద్దతుదారులుగా మారతారు. కానీ ఆ అభిమానాన్ని ఓట్లగా మార్చాలంటే బూత్ స్థాయిలో కూడా కమిటీలు వుండాలి. జిల్లాలవారీ, నెలవారీ సమావేశాలు విస్తృతంగా జరగాలి. అన్నిటికీ ఆయన హాజరు కాలేకపోయినా, తన తరఫున ప్రతినిథులను పంపించాలి. ఆ డెలిగేషన్ మన పార్టీలో కానరావటం లేదు. క్షేత్రస్థాయి రాజకీయాల గురించి పవన్‌కి ఏమీ తెలియదని, నాదెండ్ల మనోహర్ ఒక్కరే చక్రం తిప్పుతున్నారనే అభిప్రాయం బలపడుతున్నకొద్దీ, మనోహర్‌ను చూసి పార్టీకి ఓటెయ్యాలా అక్కరలేదా అని ఓటర్లు తేల్చుకునే పరిస్థితి వస్తుంది.
ఏ పార్టీ ఐనా పైకి రావాలంటే ప్రచారం అవసరం. దానికై యీ రోజుల్లో మీడియా సపోర్టు తప్పనిసరి. కరోనా వచ్చాక ప్రజలు యిళ్లలోంచి బయటకు రావడం తగ్గించారు కాబట్టి ఆ ప్రచారం వాళ్ల యింటికి చేరాలి. న్యూస్ పేపరు, టీవీ ఛానెల్, వెబ్‌సైట్, సోషల్ మీడియా.. వీటిద్వారా పార్టీ ప్రచారం జరగాలి. అవి ఆసక్తికరంగా వుండే అనేక యితర విషయాలతో పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తటస్థంగా ఉన్నట్లు కనబడుతూ, మధ్యలో పవన్ ఒక బలమైన, స్పష్టమైన ఆలోచన, లక్ష్యశుద్ధి గల నాయకుడని, ఆయన వెనుక తెలివితేటలు, చిత్తశుద్ధి వున్న అనేకమంది నాయకులు ఉన్నారనే అభిప్రాయాన్ని సటిల్‌గా చొప్పించాలి. ఇదంతా పార్టీకి సంబంధించిన మీడియా సెల్ కనుసన్నల్లో జరగాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న పవన్ అభిమానులకు డైరక్షన్ లేదు. పార్టీ ఆమోదం లేదు. ఎవరికి తోచినది వారు, వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేసి ఒక్కోప్పుడు తటస్థులకు చికాకు తెప్పించి, పార్టీ పట్ల విముఖత పెంచుతున్నారు.
టీవీ చర్చల్లో కూడా జనసేన తరఫున అధికార ప్రతినిథులు తరచుగా వెళ్లటం లేదు. అనేక విషయాలపై పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు తెలియటం లేదు. చర్చలకు వెళ్లినవారిలో కూడా కొందరు పవన్ పట్ల వీరాభిమానం ప్రదర్శిస్తున్నారే తప్ప తమకు విషయావగాహన ఉన్నట్లు కనబరచటం లేదు. దీనివలన యిది సినీహీరో అభిమానుల పార్టీ మాత్రమే తప్ప ఆలోచనాపరులతో నిండిన పార్టీ అని అనిపించటం లేదు. పార్టీలో చేరిన కొందరు మేధావులు నిరాశతో పార్టీ విడిచి వెళ్లిపోవడం యీ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. ఎన్నికల సభల్లో అభిమానులు చేసే జైజై నాదాలు ఓట్లు, సీట్లు తెప్పించవని 2019లోనే రుజువైంది. ఎన్నికలున్నా లేకపోయినా, నిరంతరం పార్టీ ఏవేవో కార్యక్రమాలు చేపట్టాలి.
నిరసనలే కాదు, నిర్మాణాత్మక కార్యక్రమాలు.. గుడికో, బడికో, రోడ్డుకో, వంతెనకో శ్రమదానమనో, రక్తదానమనో, ఆరోగ్యశిబిరమనో ఏదో ఒకటి ఏడాది పొడుగుకునా నడుస్తూ ఉండాలి. కార్యకర్తలు ప్రజల్లో మసలుతూ వుండాలి. దీనికి ఖర్చవుతుంది. ఎవరైనా కొందరు పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా అండదండలు అందించాలి. ఇతర పార్టీలకు ఆ సౌలభ్యం వుంది. కానీ మన పార్టీకి ఏ యిండస్ట్రియల్ గ్రూపూ అండగా లేదు. కాపు ధనికులు కూడా చేయూత నివ్వటం లేదు. ఎన్నికల సమయంలో పార్టీ ఆఫీసు నుంచి నిధులు అందటం లేదు. అభ్యర్థి తన స్తోమతపైనే ఆధారపడవలసి వస్తోంది. అందుకే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు వచ్చాయి. ధనికులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు మనకు నిధులివ్వటం లేదంటే దానర్థం, మనం సమీప భవిష్యత్తులోనైనా అధికారంలోకి వస్తామనీ, కనీసం పంచుకుంటామనీ వాళ్లకు నమ్మకం లేదన్నమాట. ఈ పెర్‌సెప్షన్ మారాలి. మనది సీరియస్ పార్టీ అని, 2024లో వైసిపికి తగ్గే సీట్లలో సింహభాగం మనకే వస్తాయని వాళ్లు నమ్మాలి.
ఇదంతా జరగాలంటే మనకు బలమైన ఊతం కావాలి. టిడిపితో పొత్తుకు సై అంటే చాలు, అవన్నీ బాబే చూసుకుంటారు. ఫైనాన్షియర్లు వస్తారు, మీడియా సపోర్టు ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. టీవీల్లో, సోషల్ మీడియాలో మన గురించి పాజిటివ్ కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తాయి. ఇక ఎన్నికల సమయం వచ్చేసరికి టిడిపికి ఊరూరా వున్న వాలంటీర్లు మనకీ పనిచేస్తారు. మన ట్రాన్స్‌ఫార్మర్‌కు వైర్లు ఆయనే వేయిస్తాడు. అంగబలం, అర్థబలం రాత్రికి రాత్రి సమకూరుతాయి. మనం వాటిని నమ్ముకుని చేతులు ముడుచుకుని కూర్చోకుండా, దాన్ని అవకాశంగా మలచుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ జరగాలని మనకి ఉన్నా, వెళ్లి అడిగితే లోకువై పోతాం. అలాటిదేమీ లేకుండా యిప్పుడు ఆయనంతట ఆయన అడుగుతున్నాడు. ఇదే అదనుగా మనం 50, 60 సీట్లు చులాగ్గా అడిగేయవచ్చు. తక్కినవాటిలో ఆయన్నీ, తక్కిన భాగస్వాములను సర్దుకోమనవచ్చు.’
ఇదీ పార్టీలో ఒక వర్గంవారి ఆలోచనగా వుంటుంది. ఇప్పటికే యీ విషయంలో రెండువర్గాల మధ్య మంద్రస్థాయిలో సణుగుడు వుంది. ఇలా వున్న క్యాడర్‌ను బాబు యీ ఓపెన్ ఆఫర్ ద్వారా మరింత గందరగోళంలో పడేశారని నా అనుమానం. బాబు నుంచి ప్రకటన రాగానే పవన్ ఔననో, కాదనో ఏదో ఒకటి చెప్తారని అందరూ ఎదురు చూశారు. ఆయనే తికమకపడి పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా తేలుస్తాం అనేశాడు. ఈ పార్టీ అనే కాదు, ఏ ప్రాంతీయ పార్టీలోనూ ప్రజాస్వామ్యం అనేది నేతిబీరకాయలో నెయ్యి లాటిదని అందరికీ తెలుసు. పవన్ ప్రకటన అర్థమేమిటంటే ఆయన కూడా ఎటూ చెప్పలేక సమాధానం దాటవేశాడు అని. అధినేతే అలా వుంటే యిక తక్కిన నాయకులు, కార్యకర్తల స్థితి ఎలా వుంటుందో వూహించుకోవచ్చు. ఈ అంతర్గత వాదోపవాదాల్లో పడి, జనసేన రెండుగా విడిపోయి, బిజెపి తరహాలో నిర్వీర్యం అయిపోవచ్చు. ఇదే బాబుకి కావాలి.
ఈ హైపోథిసిస్ ఒప్పుకుంటే జనసేనను నిర్వీర్యం చేయవలసిన అవసరం బాబుకి ఏముంది అనే ప్రశ్నకి సమాధానం వెతకాల్సి వస్తుంది. టిడిపి యిటీవల కాపులపై దృష్టి పెట్టిందని గమనిస్తే మనకు అది దొరకవచ్చు. టిడిపి పార్టీ పెట్టిన దగ్గర్నుంచి, దానికి సాలిడ్ ఓటుబ్యాంకు అంటే కమ్మ ప్లస్ బిసి అనేవారు, పరిస్థితుల బట్టి తక్కినవాళ్లు ఓటేయడమో, మానేయడమో జరిగినా యీ రెండు వర్గాలు ఎప్పుడూ అంటిపెట్టుకుని వుండేవి. అలాటిది 2014-19 టైములో బాబు కాపులను బిసిల్లో చేరుస్తానని చెప్పి బిసిలకు ఆగ్రహం తెప్పించడంతో బిసిలు వైసిపివైపు తిరిగిపోయారు. బిసి జిల్లాలైన ఉత్తరాంధ్రలో కూడా టిడిపి బలం తగ్గిపోయింది. ఇప్పటిదాకా వాళ్లు మళ్లీ చెంతన చేరలేదు. ఈ క్రమంలో కాపులు దగ్గరయ్యారా అంటే అదీ జరగలేదు. వాళ్ల ఓటు పలుముఖాలుగా విడిపోయింది. కొందరు వైసిపి మద్దతుదారులు అయిపోయారు కూడా. వాళ్లను ఆకట్టుకుని దగ్గరకు తీయాలంటే రెడ్ల పార్టీ ఐన వైసిపి కమ్మలనే కాదు, కాపులను కూడా హింసిస్తోందన్న కలర్ యివ్వాలి.
సినిమా టిక్కెట్టు వ్యవహారమే చూడండి. కమ్మ, కాపులకు వ్యతిరేకంగా రెడ్డి వైసిపి పన్నుతున్న కుట్ర యిది అని టిడిపి అనుకూల మీడియా ఘోషిస్తోంది. సినిమారంగమంతా కమ్మలదే అని చాలాకాలంగా అంటూ వచ్చారు. ఆ మధ్య అలాటి చర్చే వచ్చినపుడు తెర మీద నటుల్లో కాపులు కూడా గణనీయంగా వున్నారనీ, సాంకేతిక నిపుణుల్లో యితర కులాలు ఎక్కువని, సినీనిర్మాణానికి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వచ్చేసరికి అనేక కులాలు వున్నాయని ఒక ఆర్టికల్‌లో రాశాను. ఎవరైనా ఓపిగ్గా గణాంకాలు సేకరిస్తే క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. కానీ యీ మీడియా మాత్రం ఆంధ్రలో రెడ్లు తప్ప వేరెవ్వరూ బతికే పరిస్థితి లేదని, కమ్మలతో సమానస్థాయిలో వున్న కాపులను చూసినా రెడ్లు కన్నెర్ర చేస్తున్నారనీ, నష్టపరుస్తున్నారనీ ఊహూ రెచ్చగొట్టేస్తోంది.
ఇది నిజంగా వర్కవుట్ అయ్యి కాపుల్లో ఎవేర్‌నెస్ పెరిగి ‘అవును, మనం నష్టపోతున్నాం, ఐక్యంగా వుండి తక్కినవాళ్ల దుంప తెంపాలి’ అనే చైతన్యం రగిలితే ఆ బెనిఫిట్ ఎవరికి పోతుంది? ఒక కాపు నాయకుడి నేతృత్వంలో నడుస్తున్న జనసేన పార్టీకే పోతుంది. సంఖ్యాబలం ఉన్నా, ఐకమత్యరాహిత్యం వలన కాపు ముఖ్యమంత్రిని తెచ్చుకోలేక పోయాం, ఆంధ్ర విడిపోయిన తర్వాతైనా తెచ్చుకోవాలి అని కాపులు ఉద్యమిస్తే వాళ్లకు కనబడే ఫస్ట్ ఛాయిస్ జనసేనే! ఈ మధ్యే పార్టీల కతీతంగా కాపునాయకులు కలిసి మాట్లాడుకుంటున్నారు. తమ తమ పార్టీల్లో కాపు కులబలాన్ని చాటుకోవడం ఎలాగా అని సమాలోచనలు చేస్తున్నారు.
‘బాబు భార్య పట్ల వాళ్ల మాజీ సహచరుడు అనుచితంగా మాట్లాడి నెలన్నర తర్వాత క్షమాపణ చెప్పినా అంత రగడ చేశారు, మా యింటి కాపు స్త్రీలకు ఘోరమైన అవమానం జరిగితే బాబుకి చీమ కుట్టినట్లు లేదు, మీడియా కిమ్మనలేదు’ అని ముద్రగడ ఆరోపణ ఒకటి బలంగా నాటుకుంది. ఇలాటి ఎవేర్‌నెస్ పెరిగితే కాపులు జనసేన పతాకం కింద సమీకృతం అయ్యే ప్రమాదం వుంది. వైసిపి వ్యతిరేక ఓటు మొత్తం తనకే రావాలని కోరుకునే బాబు ప్రణాళికకు యిది విఘాతం కలిగిస్తుంది. అందువలన జనసేనను బలహీనపరిస్తే వేరు మార్గం లేక, రెడ్డి వ్యతిరేకతతో కాపులు తన ఛత్రం కిందే చేరతారు కదాని ఆయన ఐడియా కావచ్చు! వేరే చెప్పనక్కరలేదు, యివన్నీ మన ఊహలే! బాబు ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకే బాగా తెలుస్తుంది, కానీ యిది ఆషామాషీ స్టేటుమెంటు మాత్రం కాదని మనం గుర్తెరగాలి.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)