మండలిలో తాము అద్భుత విజయం సాధించినట్టుగా తెలుగుదేశం పార్టీ తెగ సంబరాలు చేసుకుంటూ ఉంది. అయితే మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆగడం కేవలం తాత్కాలికమే అని స్పష్టం అవుతూ ఉంది. ఉభయ సభలనూ సమావేశ పరిచి, ఈ బిల్లును ఆమోదింపజేసుకోవచ్చని కొందరు నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాల్సి ఉంది..
ఇదే సమయంలో వినిపిస్తున్న మరో మాట మండలి రద్దు! శాసనమండలిని రద్దు చేసేస్తే శాసనసభ మాత్రమే మిగులుతుంది. అప్పుడు వికేంద్రీకరణ బిల్లు అమలు కోసం మూడు నెలల సమయం ఆగాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. మరే అవసరం లేకుండా ప్రభుత్వం చేసిన శాసనం అమలవుతుంది.
సపోజ్.. జగన్ అంత పని చేశాడనే అనుకుందాం! శాసనమండలిని రద్దు చేసేస్తే జగన్ కు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వాటిల్లో ఒకటి రాజకీయ నిరుద్యోగులకు ఆశశ్రయం కల్పించే అవకాశం లేకపోవడం ఒకటి. అలాగే జగన్ కేబినెట్లో ఇద్దరు మంత్రులు మండలి సభ్యులు. వారు తన వెంట ఉన్నారనే కారణం చేత వారికి జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. ఎన్నికల్లో నెగ్గలేకపోయిన వాళ్లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారందరికీ ఎలాగో సర్ధి చెప్పి.. జగన్ మండలిని రద్దు చేశారంటే.. అప్పుడు రాజకీయ నిరుద్యోగి అయ్యేది కేవలం లోకేష్ బాబు మాత్రమే!
ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ బాబు ఎమ్మెల్సీగా కొనసాగుతన్న సంగతి తెలిసిందే. కొందరు రాజకీయ నిరుద్యోగులు, ముసలి నేతలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినా.. లోకేష్ మాత్రం ఆ ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఎమ్మెల్యే ఓడిన తర్వాత, తనను ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా లోకేష్ తనకన్నా తోపు లేడన్నట్టుగా ఎమ్మెల్సీగా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మండలి గనుక రద్దు అయితే.. లోకేష్ కేవలం చంద్రబాబు నాయుడి తనయుడిగా మాత్రమే మిగిలిపోయే అవకాశాలున్నాయి. పొలిటికల్ కెరీర్ ఆరంభంలోనే మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకోవాల్సి వస్తే లోకేష్ పరిస్థితి ఏమిటో!