ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మండలి చైర్మన్ తీరు ఏ మాత్రం ప్రజాస్వామ్యికంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన అనైతికంగా వ్యవహరించారని అన్నారు. మండలి చైర్మన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తొత్తులా వ్యవహరించారని కూడా బొత్స వ్యాఖ్యానించారు. తను చట్టానికి అనుగుణంగా వ్యహరించడం లేదని స్వయంగా మండలి చైర్మన్ ప్రకటించారని బొత్స గుర్తు చేశారు.
డివిజన్ చేయకుండా బిల్లును సెలెక్టివ్ కమిటీ పరిగణనలోకి ఎలా పంపుతారని బొత్స ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన వ్యక్తికి చైర్మన్ హోదాలో కూర్చునే అర్హత ఏముందని బొత్స ప్రశ్నించారు. ఒక రాజకీయ తొత్తును తీసుకువచ్చి మండలి చైర్మన్ హోదాలో కూర్చోబెడతారా? అని ఆయన ప్రశ్నించారు.
మండలి చైర్మన్ తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు. తాము ఎవరినీ ప్రభావితం చేయాలని చూడలేదని… చంద్రబాబు నాయుడే నీఛ రాజకీయాలు చేస్తూ, రాజకీయాలకు ఉన్న విలువను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉంటారని అన్నారు. ఎన్ని అడ్డంకులను సృష్టించినా.. తాము ప్రజాబలంతో ముందుకు వెళ్తామని బొత్స ప్రకటించారు.