సీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే స్వీయ తప్పిదాలే ఆమెకు తగిన పదవి రాకుండా చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు మంత్రి పదవి రాకపోవడంపై వైసీపీ కార్యకర్తలు కూడా బాగా ఫీల్ అయ్యారు. గతంలో చంద్రబాబు పాలనలో ఆమె ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో వైసీపీ కార్యకర్తల్లో ఆమెపై సానుభూతి ఉంది.
ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు ఆమె మంత్రివర్గం లిస్ట్‌లో ఉందని టాక్. అయితే చిత్తూరు జిల్లాకే చెందిన ఓ ముఖ్యనేత అభ్యంతరంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదని సమాచారం. జగన్‌కు దగ్గరగా ఉంటే చాలు, ఇక మిగిలిన వారితో పనేంటి అనే ధోరణిలో ఉంటూ, ఇతర వైసీపీ పెద్దలతో గౌరవంగా ఉండదనే అక్కసుతో మంత్రి పదవికి అడ్డుపుల్ల వేసినట్టు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతేకాకుండా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసే రామోజీ సంస్థ ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమానికి రోజా జడ్జిగా వ్యవహరించడం కూడా ఆమెకు అధిష్టానం వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయి. ప్రస్తుత విషయానికి శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఉండింది. శాసనమండలి గ్యాలరీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు. అలాగే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆర్కే రోజా, ఇతర నాయకులు వెళ్లి గ్యాలరీల్లో కూర్చున్నారు.
ఒక వైపు శాసనమండలి పదేపదే వాయిదాలు పడుతుంటే, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణతో రోజా సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు. బాలకృష్ణతో సెల్ఫీ దిగిన ఫొటోలు పత్రికల్లో వచ్చాయి. అసలు రోజా అంటే సొంత పార్టీలో గిట్టని వారు చాలా మంది నాయకులే ఉన్నారు. ప్రస్తుత ఈ తరుణంలో బాలకృష్ణతో సెల్ఫీ దిగిన ఫొటోలతో రోజాపై వ్యతిరేకంగా చెప్పేందుకు అవకాశం కల్పించినట్టైంది. రోజా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అంటున్నారు.