తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆసక్తిదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ పూర్తైన తొలి రెండు రౌండల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందనరావు ముందుండటం గమనార్హం. తొలి రెండు రౌండ్ లలో కలిపితే ఆయనకు 1135 ఓట్ల మెజారిటీ లభించింది. తొలి రౌండ్ లో ఆయన మూడు వందలకు పైగా ఓట్ల మెజారిటీ రాగా, రెండో రౌండ్ పూర్తయ్యే సరికి మెజారిటీ పదకొండు వందలు దాటింది.
ఇవి ఒకింత సంచలన ఫలితాలే అని చెప్పవచ్చు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో దుబ్బాకలో తెలంగాణ రాష్ట్ర సమితి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు సానుభూతి కూడా ఆ పార్టీకే ఉంది. భారీ మెజారిటీ ఖాయమనే లెక్కలతో టీఆర్ఎస్ కనిపించింది. అయితే తొలి రెండు రౌండ్ల ఫలితాల్లో టీఆర్ఎస్ వెనుకబడి పోవడం, బీజేపీ లీడ్ లో ఉండటం విశేషమైన అంశం అవుతోంది. ఇదే ట్రెండ్స్ కొనసాగుతాయా? అనేదీ కీలకమైన ప్రశ్న.
అంతిమ పలితం ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం దుబ్బాకలో సత్తా చూపినట్టే అవుతోంది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే బీజేపీ ఈ సీటును సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోలేని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే.. అధికార టీఆర్ఎస్ కు ఝలక్కే అవుతుంది.
-మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 1885 ఓట్ల లీడ్ లో ఉన్నారు.