పాలకుడు మనోడు కాకపోతే ఏమైనా రాయొచ్చనే పాలసీతో… విచక్షణ మరిచి రాతలు రాస్తున్న ఈనాడుకు సోషల్ మీడియా పుణ్యమా అని దూల తీరుతోంది. తమ ఇష్టమైన నేత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన జనం ఎట్టకేలకు ఆయన్ని ఇంటికి పంపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత పచ్చ బ్యాచ్‌కు ఇష్టం లేని నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని ఎల్లో బ్యాచ్ ఇష్టానురీతిలో విమర్శలు చేయడం, తప్పుడు కథనాలు రాయడం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో “నీట మునిగినా చోటు మార్చం” అంటూ తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక బ్యానర్ కథనాన్ని అచ్చోసింది. ఈ కథనంపై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది.
ప్రశ్నలు, నిలదీతలతో ఈనాడుకు ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో ఈనాడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వర్షపు నీటికి మునిగే ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలను ప్రభుత్వం ఇస్తోందనేది ఈనాడు బాధ, ఆవేదన.
ఈ కథనానికి బలం కలిగించేందుకు ఫస్ట్ పేజీలో ఓ చక్కటి ఫొటోను ప్రచురించారు. సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వానలకు …నెల్లూరు శివారు భగత్‌సింగ్ కాలనీ సమీపంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన భూములు మునిగిన తీరు అంటూ ఆ ఫొటోకు రైటప్ ఇచ్చారు. ఇక కథనం ఎలా సాగిందో చూద్దాం.
“రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములను ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసి కొనింది. వీటిలో కొన్ని స్థలాలు చెరువులకు చేరువలో, మరికొన్ని అలుగులు, కాలువల కింద ఉన్నందున కొద్దిపాటి వర్షానికే బురదగుంటగా మారుతున్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు అవి చెరువులయ్యాయి. కొన్నిచోట్ల నాలుగైదు అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఇదే పరిస్థితి.
ఇళ్లు కట్టకు ముందే ఇలా ఉంటే, నిర్మాణాలు పూర్తయిన తర్వాత నివాసం ఉండడానికి వీలవుతుందా? అనే ప్రశ్న లబ్ధిదారుల నుంచి వస్తోంది. ఈ స్థలాలు మాకొద్దు …మరోచోట ఇవ్వండని లబ్ధిదారులు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు”
ఈ రాతలపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మరి వరద ప్రాంతంలో రాజధాని ఎలా కట్టాలనుకుంటున్నారని, అక్కడే కొనసాగించాలని ఎలా ఉద్యమిస్తున్నారని, దానికి రామోజీరావు ఎందుకు మద్దతుగా నిలిచి రోజూ వార్తా కథనాల్ని వండివార్చుతున్నారని నెటిజన్లు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. కొండవీడు వాగు ఏ ప్రాంతంలో ఉందో, దాన్ని ఎందుకు కట్టారో రాయాలని ఈనాడుకు ఉచిత సలహాలిస్తున్నారు.
పేదలకైతే ఒక నీతి, రాజధాని రియల్టర్లకైతో మరో నీతా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెగ బాధపడుతున్న ఈనాడు, మరి 29 గ్రామాల్లో అభివృద్ధిని కేంద్రీకరించేందుకు లక్షల కోట్లు ఖర్చు చేయడాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఉన్నోళ్లకైతే ఒక నీతి, లేనోళ్లకైతో మరో నీతా? ఇదేనా ఈనాడు రీతి? అంటూ సృజనాత్మకంగా, కవితాత్మక విమర్శలతో ఈనాడును దుమ్ము దులుపుతున్నారు.
“నెల్లూరు నగర శివార్లలోని జాతీయ రహదారిని అనుకుని ఉన్న భగత్‌సింగ్ కాలనీ సమీపంలో 3 వేల ఇళ్ల ప్లాట్లను పంపిణీకి అనువుగా మార్చారు. ఇది పెన్నా నదిని ఆనుకుని ఉంది. నది గట్టుకు ఉన్న దిబ్బల్లోని మట్టిని తవ్వి ఇళ్ల స్థలాలను చదును చేయడానికి వాడేశారు.
దీంతో గత నెలలో సోమశిల జలాశయం నుంచి వరద నీటిని పెన్నా నది ద్వారా దిగువకు వదలడంతో ఇళ్ల స్థలాల్లోకి చేరింది. అప్పటికప్పుడు అధికారులు ఇసుకతో గట్టు వేసి తాత్కాలికంగా నీళ్లు రాకుండా కట్టడి చేశారు” అని ఈనాడు తన కథనంలో రాసుకొచ్చింది.
మరి చంద్రబాబు ప్రభుత్వం తమ స్వార్థ స్వప్రయోజనాల కోసం కృష్ణానది గర్భంలో భారీ కట్టడాలు చేపట్టినట్టు ఏనాడైనా ఈనాడు రాసిందా? ఆ పత్రిక కంటికి అవేవీ ఎందుకు కనిపించలేదని తీవ్రస్థాయిలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
రాజధాని ఎంపిక కోసం నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో వరద ముంపు ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ఏర్పాటు సరైందని కాదని పేర్కొన్న విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఏకంగా విదేశీ కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నించిన చోటు నిన్నటి వరదలకు ఏమైందో ఏ రోజైనా ఈ మీడియాలో చూపించారా? అంటూ ఎల్లో మీడియాను నిలదీస్తుండడం విశేషం. అలాగే రాజధాని ప్రాంతంలో ఉన్న చంద్రబాబు ఇంటిలోకి వరద నీళ్లు రావడాన్ని నెటిజన్లు ఈనాడుకు గుర్తు చేస్తున్నారు.
ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలకు భూములు ఇచ్చినప్పుడు అవి బీడు భూములుగా ఉండటం సహజమని, అలాంటి భూములలో భారీ వర్షాలకు నీళ్లు చేరడం సహజమని చెబుతున్నారు. దాన్ని భూతద్దంలో చూపించడమన్నది మీడియా వక్రబుద్ధి కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ నిజంగానే శాశ్వతంగా వరద ప్రాంతాల్లో ఏ ప్రభుత్వం ఇళ్లు కట్టినా తప్పేనని, ఒకట్రెండు ప్రాంతాలను తీసుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు మంచివి కావని హితవు చెబుతున్నారు.
ఈనాడు తాజా కథనం ప్రకారం అమరావతిలో రాజధాని కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదని అర్థమవుతోందనే స్పష్టత నెటిజన్లు ఇవ్వడం గమనార్హం. “నీట మునిగినా రాజధాని మార్చొద్దు” అన్నట్టు ఈనాడులో రాజధానిపై ఈనాడులో ఉద్యమ వార్తా కథనాలు వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
నాణేనికి రెండో వైపు కూడా ఉంటుందని ఈనాడు మరిచిపోవడం వల్లే ఇలాంటి కథనాలు వస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. కావున జగన్ సర్కార్ ఎంచుకున్నట్టు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదనలో బాగంగా రాయలసీమలో న్యాయ రాజధానిని ,ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధానిని శరవేగంగా మార్చడం ధర్మమని సెలవిస్తున్నారు.