అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్రలో తమ ఆకు చిరిగిపోయినా ఫర్వాలేదు.. అమరావతే అంటున్న తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు మీద పూల వర్షం కురిసిందట. అదేమీ పై నుంచి పడ్డది కాదు లెండి. తెలుగుదేశం కార్యకర్తల పనే!
అయితే తెలుగుదేశం పార్టీకి ఏం చేసినా టెంపరరీ చేసుకోవడం అలవాటు అయ్యిందని అంటున్నారు పరిశీలకులు. టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ రాజధాని.. ఇప్పుడు వాటన్నింటి విషయంలోనూ తాత్కాలిక సంబరాలు!
మండలిలో వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం అడ్డుకుని ఉండవచ్చు గాక. ఇదంతా తాత్కాలికమే అని మేధావులు స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ అనుకుంటే ఇప్పటికీ అవకాశం ఉందని.. ఉభ సభలనూ సమావేశ పరిచి..బిల్లును ఆమోదింపజేయవచ్చని కూడా కొంతమంది సీనియర్ పార్లమెంటేరియన్లు చెబుతూ ఉన్నారు. ఉభయ సభలనూ సమావేశ పరిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఏ మూలకుపోతుందో వేరే చెప్పనక్కర్లేదు.
కొన్ని కొన్ని సార్లు కేంద్రంలో ప్రభుత్వాలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని కొందరు సీనియర్లు చెబుతూ ఉన్నారు. ఒకవేళ అలా ఏం చేయకపోయినా.. మూడు నెలల తర్వాత అయినా ప్రభుత్వం అనుకున్నదే చేస్తుంది. అప్పుడు ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించవచ్చు కూడా. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం సంబరాలు యథారీతిన కామెడీ అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.