పవన్ ఎప్పుడూ ఇంతే.. ఆయన మారడంతే

తను వెళ్లే రైలు జీవితకాలం ఆలస్యం అంటాడో కవి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహార శైలి కూడా ఇలానే ఉంటుంది. ప్రతి అంశాన్ని కెలికేయాలని చూస్తాడు, కార్యాచరణ ప్రకటిస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది.…

తను వెళ్లే రైలు జీవితకాలం ఆలస్యం అంటాడో కవి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహార శైలి కూడా ఇలానే ఉంటుంది. ప్రతి అంశాన్ని కెలికేయాలని చూస్తాడు, కార్యాచరణ ప్రకటిస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. హడావుడి తప్ప ఫలితం శూన్యం. చివరికి ప్రజల్లోకి వెళ్లాలనుకునే పవన్ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఇప్పుడు 3 రాజధానుల అంశంపై కూడా పవన్ ఇలానే తాపీగా రియాక్ట్ అవుతున్నారు.

రాజకీయంగా 3 రాజధానుల అంశాన్ని టీడీపీ ఎప్పుడో తన సొంతం చేసుకుంది. అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తోంది. చంద్రబాబు అండ్ కో ఇప్పటికే పూర్తిస్థాయిలో రచ్చ చేశారు. మరోవైపు రాజధాని రైతుల ఆందోళనలు 37వ రోజుకు కూడా చేరుకున్నాయి. ఇంత జరుగుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే రంగంలోకి దిగుతారు. తాము చేయాలనుకున్న పనులు చకచకా చేస్తారు. కానీ పవన్ మాత్రం మరో 10 రోజులు ఆగి వస్తున్నాడు.

బలంగా వస్తాం, బలంగా గొంతు వినిపిస్తామంటూ సినిమా డైలాగులు చెప్పే పవన్.. నిదానంగా 10 రోజుల తర్వాత ఆందోళనకు సిద్ధమౌతున్నారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి విజయవాడలో లాంగ్ మార్చ్ చేస్తామని ప్రకటించారు. అంటే అప్పటికి అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 47 రోజులకు చేరుకుంటుందన్నమాట. అప్పుడు తాపీగా పవన్ రంగంలోకి దిగుతున్నాడన్నమాట.

కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ అంశాన్ని తీసుకున్నా జనసేన వ్యవహారశైలి, పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఇలానే ఉన్నాయి. గతంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ లాంటి అంశాలపై కూడా జనసేనాని ఇలానే అంతా తెల్లారిపోయిన తర్వాత మేల్కొన్నారు. తూతూమంత్రంగా కొన్ని కార్యక్రమాలు జరిపించి వాటిని అక్కడితో వదిలేశారు.  

పవన్ ఈ వ్యవహార శైలి పార్టీ కార్యకర్తలకు నచ్చడం లేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇకనైనా రంగంలోకి దిగాల్సింది పోయి ఇంకా ముహూర్తాలు, అమృత ఘడియలు లెక్కించుకొని కూర్చుంటే ఎలా అంటూ విసుక్కుంటున్నారు. ఇది సినిమా ఓపెనింగ్ కాదని, ప్రతిది తేదీ-టైమ్ చూసి చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైమ్ లోనైనా జనసేన పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని, అంతా చల్లారిపోయిన తర్వాత లాంగ్ మార్చ్ చేసి ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ అంతే.. ఆయన మారడంతే.

చేతకాని సంస్కార హీనులు మీరు