తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయం సాధించేసినట్టుగా బిల్డప్ ఇస్తోంది. విజయగర్వం ప్రదర్శిస్తోంది. రాజధాని తరలింపును సమూలంగా ఆపేసినట్లుగా వాళ్లు ఆడంబరంగా కనిపిస్తున్నారు. పచ్చ మీడియా మొత్తం.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అన్నట్లుగా.. జగన్ సర్కారు ఓడిపోయినట్లుగా తమకు ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు. తెలుగుదేశం ఇవాళ ఇలాంటి ‘విజయం’ లాంటి భావనలో ఉండడానికి, ప్రజలను అలా భ్రమింపజేసేలా ప్రవర్తించడానికి ప్రధాన కారణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే!
మండలిలో బిల్లు నెగ్గే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. నెగ్గకపోతే ఏం చేయాలో కూడా వారివద్ద తరణోపాయం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా సరే.. మండలిలో బిల్లును నెగ్గించుకోవడానికి వారు ఆరాటపడుతున్నట్లుగా కనిపించారు. దాంతో.. కేవలం వారి ఆరాటం వల్లనే… అక్కడ నెగ్గకపోతే.. బిల్లు ఆగిపోయినట్లేనేమో అనే భ్రమ ప్రజలకు కలిగింది.
రాజధాని వికేంద్రీకరణ బిల్లు మండలిలో నెగ్గకపోయినంత మాత్రాన ప్రభుత్వానికి జరిగే చేటు ఎంతమాత్రమూ లేదు. కేవలం నిర్ణయం కార్యరూపం దాల్చడం కొంత ఆలస్యం అవుతుంది అంతే. మండలి బిల్లును తిరస్కరిస్తే, శాసనసభలో మళ్లీ పాస్ చేసి.. చట్టం చేసేయవచ్చు. మండలి గనుక… బిల్లును సెలక్ట్ కమిటీకి పంపితే మూడు నెలలు ఆగవలసి ఉంటుంది. ఆ తర్వాత.. శాసనసభ మళ్లీ బిల్లును ఆమోదించి.. చట్టం చేస్తుంది.
అంటే మండలి తిరస్కరించడానికి ఆమోదించడానికి మధ్య తేడా కేవలం మూడు నెలల ఆలస్యం. ఆ మాత్రం దానికి వైకాపా అనవసరంగా కంగారు పడిపోయింది. మండలిలో మంత్రులు పోడియం వద్దకు వెళ్లి రాద్ధాంతం చేయకుండా, రభస చేయకుండా.. నింపాదిగా ఈ సెలక్ట్ కమిటీ నిర్ణయం తొలిరోజునే జరిగిపోయే లాగా.. శాంతంగా ఉండిఉంటే.. ప్రభుత్వం ఓడిపోయిందనే భ్రమ ప్రజలకు కలిగేది కాదు. వారు ప్రత్యేకమైన వ్యూహంతో ఉన్నారని అంతా అనుకునేవారు. తెలుగుదేశం తమ మండలి బలంతో సెలక్ట్ కమిటీకి పంపినా కూడా సాధించేదేమీ లేదని.. అందుకే వైకాపా నిమ్మళంగా ఉన్నదని అనుకునే వాళ్లు. అలా కాకుండా కంగారు ప్రదర్శించినందువలనే.. వైకాపా.. తెదేపా బిల్డప్ లకు అవకాశం కల్పించింది.