శత్రువుని ఊరి పొలిమేరలో కొడితే మజా ఏముంటుంది. వాళ్ల ఊరిలో, వీలైతే వాళ్ల ఇంటి ముందు కొడితేనే నలుగురికీ మననేంటో తెలుస్తుంది. అదే ఫార్ములాని పట్టుకున్నారు కేసీఆర్. తెలంగాణలో బీజేపీ ఆయనకు పక్కలో బల్లెంలా మారుతోంది. రోజు రోజుకీ ఓట్లు, సీట్లు, నాయకులు కూడా పెరుగుతున్నారు. ఈ దశలో బీజేపీని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి.
తెలంగాణలో బీజేపీ విస్తరణ ఆపేస్తే సరిపోతుందా.. లేకపోతే ఢిల్లీ వెళ్లి అధినాయకత్వాన్ని చికాకు పెడితే తెలంగాణలో వేలు పెట్టడం ఆపేస్తుందా..? రెండో పద్ధతికే కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఢిల్లీలోనే రచ్చ చేయాలని చూస్తున్నారు.
వామపక్షాల అండతో..
అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిపి మహా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ముందు వారి పప్పులు ఉడకలేదు. ఆ దెబ్బతో మరోసారి కేసీఆర్ కూటముల జోలికి వెళ్లలేదు. ఆయనకి ఇంతవరకు ఆ అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ గద్దెపై గురిపెట్టారు కేసీఆర్. అందుకే వామపక్ష అగ్రనేతలతో భేటీ అయ్యారు. అంతకు ముందే ఆయన తమిళనాడు వెళ్లి సీఎం స్టాలిన్ ని కలసి వచ్చారు.
ఇటీవల బీహార్ నుంచి జూనియర్ లాలూ కేసీఆర్ ని కలిసేందుకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు, పాట్నా నుంచి సీనియర్ లాలూ.. కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకం కావాలంటూ సందేశం పంపించారు. ఇదంతా చూస్తుంటే 2024 నాటికి ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం కేసీఆర్ ఏదో చేస్తున్నట్టు అనిపించడం ఖాయం.
మాయా, మమత, కేజ్రీతో కాని పని..
మాయావతి ఆల్రెడీ చేతులెత్తేశారు, మమతా బెనర్జీ బెంగాల్ విజయంతో ఎవ్వర్నీ లెక్కచేయడం లేదు, అటు కేజ్రీవాల్ కూడా తన పార్టీ బలపడితే చాలు, ఇతర పార్టీలతో పొత్తులు వద్దు అనుకుంటున్నారు. ఇంత ధీమాగా ఉన్న వీరందర్నీ కలుపుకొని వెళ్లడం అటు కాంగ్రెస్ కి కూడా సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్షాలు దేశవ్యాప్తంగా బలహీనపడినా.. వాటికి ఉన్న ఓటు బ్యాంకు మళ్లీ దగ్గరైతే అద్భుతాలు జరక్క మానవు. అందుకే కేసీఆర్ ఇటునుంచి నరుక్కు వస్తున్నారు. వామపక్షాలను చేర్చుకుని కూటమికి నాయకత్వం వహించేందుకు చూస్తున్నారు.
గతంలో ఓసారి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్లాన్ వేసినా అది సాధ్యం కాలేదు. ఫెడరల్ ఫ్రంట్ వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి ఆయనకు మరో అవకాశం వచ్చింది. భావ సారూప్యత ఉన్న పార్టీలు, పార్టీల నాయకులంతా ఆయన దగ్గరకే వస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ పుట్టలో వేలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న సందర్భంలో కేసీఆర్ తెలివిగా అసెంబ్లీ ఎన్నికలను ఓ పద్ధతి ప్రకారం ఏడాది ముందుకు లాక్కొచ్చారు. ఇప్పుడు తన ప్రణాళికలను పట్టాలెక్కించబోతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో తెలుగోడి సత్తా చూపించిన ఎన్టీఆర్ లా.. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ పౌరుషం చూపిస్తానంటున్నారు.