ముసుగు తీసి బయటపడ్డ ‘ఉద్యమ ఫైనాన్షియర్’!

అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పెద్దలు ఇబ్బడి ముబ్బడిగా అక్కడ పొలాలు కొని తమ సంపదలు పెంచుకున్నారని అనేక ఆరోపణలున్నాయి. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్…

అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పెద్దలు ఇబ్బడి ముబ్బడిగా అక్కడ పొలాలు కొని తమ సంపదలు పెంచుకున్నారని అనేక ఆరోపణలున్నాయి. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి పాత్ర కూడా ప్రధానంగా ఉన్నట్టుగా తొలినుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. తెలుగుదేశంతో తన ఆత్మ ముడిపడి ఉన్నప్పటికీ.. బిజెపి పంచన చేరి తన ఆస్తులను కాపాడుకుంటున్న సుజనా చౌదరి ఇన్నాళ్లకు ముసుగు తీసి బయటకు వచ్చారు. 

‘అమరావతి కోసం’ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని సుజనా చౌదరి గుంటూరులో తెలుగుదేశం నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గుంటూరులో ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబులతో ఆయన సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. అమరావతి పోరాటానికి మద్దతిచ్చిన బిజెపి నేత సత్యకుమార్ పై దాడి అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే సుజనాచౌదరి ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారనే ప్రచారం ఒక్కటి ఇప్పుడు జరుగుతోంది. 

సుజనా చౌదరి ప్రజాబలం ఇసుమంతైనా లేని నాయకుడే అయినప్పటికీ.. కేవలం తన వద్ద ధనవనరులను కీలక నాయకులకు వెదజల్లడం ద్వారా మాత్రమే అగ్ర నాయకుడిగా చెలామణీ అవుతుంటారనే ఆరోపణలు చాలా సార్లు వినిపిస్తుంటాయి. అలాగే అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్టులు సాగిస్తున్న పోరాటానికి కూడా, అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్న సుజనాచౌదరి ప్రధాన ఫైనాన్షియర్ అనే పుకార్లు ఉన్నాయి. 

అదే సమయంలో.. బిజెపి ఏపీ వ్యవహారాల్లో సోము వ్యతిరేక కూటమికి, ప్రధానంగా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లి వివాదంలో చిక్కుకున్న సత్యకుమార్ కు కూడా సుజనాచౌదరితో చాలా ‘దగ్గరి’ సంబంధాలు ఉన్నాయని పార్టీలో చెబుతుంటారు. అలాంటిది.. సత్యకుమార్ మీద దాడి జరగగానే సుజనా వెళ్లి తెలుగుదేశం నాయకులతో భేటీ కావడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. 

తెలుగుదేశం నాయకుడు అయిన సుజనాచౌదరి ఇంకా ఎన్నాళ్లు కమలం ముసుగు కప్పుకుని ఉంటారో.. తెలుగుదేశం గెలుస్తుందని వారంతా అనుకుంటున్న వేళ ఎన్నికలకు ముందే తిరిగి చంద్రబాబు పంచన చేరుతారా? లేదా, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటూ.. కమలం పార్టీలోనే కొనసాగుతూ.. చంద్రబాబుకోవర్టుగానే ఎన్నాళ్లయినా గడుపుతారా? అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు.