శాసనమండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చాయనే మాట బలంగా వినిపిస్తోంది. శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ రూల్స్ పాటించకుండా విచక్షణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అధికార వైసీపీతో పాటు ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలను పరిశీలిద్దాం.
‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరడంలో టీడీపీ నిబంధనలను అతిక్రమించింది. బిల్లులపై టీడీపీ సకాలంలో సవరణలు అందించలేదు. కాలాతీతం అయ్యింది. దాంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని టీడీపీ అడగటం తప్పే. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా అదే విషయం చెప్పారు. సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న టీడీపీ వాదన నిబంధనల ప్రకారం లేదని స్పష్టమైంది. దాంతో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించాలి. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి లేదు. కానీ చైర్మన్‌గా రూలు 154 కింద నాకున్న విచక్షణాధికారాలతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నా’ అని ప్రకటించారు.
శాసనమండలి చైర్మన్ నిర్ణయంపై టిడీపీ మినహా మిగిలిన మండలి సభ్యులు తప్పు పట్టారు. విచక్షణ అధికారాలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాగా విచక్షణ అధికారాలపై ప్రముఖ విశ్లేషకుడు, ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా విలువైన మాటలన్నారు. ఆయన ఏమన్నారంటే….
‘శాసనమండలి చైర్మన్‌కు సభా సంప్రదాయాలను, సభా నియమాల్ని కూడా పక్కన పెట్టే విచక్షణాధికారం ఉండదు. విచక్షణాధికారం కూడా రాజ్యాంగ బద్ధంగానే ఉండాలి. సభా రూల్స్‌కు, సభా సంప్రదాయాలకు భిన్నమైన విఛక్షణాధికారాలు ఉండవు. ఎక్కడైతే రూల్స్ ఉండవో, ఎక్కడైతే సంప్రదాయాలు (కన్వెన్సన్స్) ఉండవో అక్కడ విచక్షణాధికారం ఉంటుంది. రూల్స్, కన్వెన్సన్స్ ఉన్నచోట విచక్షణాధికారం ఏంటి? ’ అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చక్కటి విశ్లేషణ చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినట్టు శాసనమండలి సభా నియమాల్ని, సంప్రదాయాల్ని పక్కన పెట్టి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం వెనుక టీడీపీ, చైర్మన్ కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ తెచ్చినట్టు కాదా? మండలిలో తమకు బలం ఉంది కాబట్టి, విచక్షణ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోతే శాసనసభ ఎందుకు? ప‌్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ప్రజాభిప్రాయానికి విలువేంటి.