ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. అసంతృప్తవాదులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు రాజకీయ ఇంటిపోరు తప్పడం లేదు. అంబటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేకులు ఏకమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. సత్తెనపల్లి నుంచి అంబటి వైసీపీ తరపున గెలుపొందారు. స్థానికేతరుడైనప్పటికీ సామాజిక, రాజకీయ సమీకరణల రీత్యా ఆయన్ను గెలిపించుకున్నారు.
అయితే అంబటి తమను ఏ మాత్రం పట్టించుకోలేదని కొంత మంది వైసీపీ నాయకులు గత కొంత కాలంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అది కాస్త రోజురోజుకూ పెరిగి పెద్దవుతోంది. తాజాగా ఇవాళ సత్తెనపల్లిలో వైసీపీ ఆత్మీయ సమావేశం పేరుతో అంబటి వ్యతిరేక వర్గం భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశం వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతోంది. అంబటిని ఈయన గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
అంబటిని మార్చకపోతే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని వైసీపీలోని ఒక వర్గం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. మరోవైపు అంబటి వైసీపీలోని అసమ్మతి నేతలతో ఇబ్బంది పడుతున్నారు.
అసమ్మతి నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. గెలిచి వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తానని ఆయన ప్రకటించడం విశేషం. ఇదిలా వుండగా వైసీపీ ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరు కావడం అధికార పార్టీని కలవరపెడుతోంది.