మోదీపై క‌విత ట్వీట్…ఓ రేంజ్‌!

ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఎప్పుడూ విరుచుకుప‌డుతుంటారు. అన్న బాట‌లో చెల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కూడా ప్ర‌యాణిస్తున్నారు. తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీపై క‌విత చేసిన కామెంట్స్‌… సోష‌ల్ మీడియాలో ఓ…

ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఎప్పుడూ విరుచుకుప‌డుతుంటారు. అన్న బాట‌లో చెల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కూడా ప్ర‌యాణిస్తున్నారు. తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీపై క‌విత చేసిన కామెంట్స్‌… సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ అనే రీతిలో అదిరిపోయింది. ప్ర‌ధాని మోదీ విద్యార్హ‌త‌పై కేజ్రీవాల్ న్యాయ‌పోరాటం గురించి దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

దేశాన్ని ప‌రిపాలించే ప్ర‌ధాని మోదీ విద్యార్హ‌త‌ల‌తో ప‌నేంట‌ని ప్ర‌శ్నించే వాళ్ల‌ను చూడాల్సిన దుస్థితిలో మ‌నం ఉన్నాం. మ‌రోవైపు కేజ్రీవాల్ మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌ధాని విద్యార్హ‌త‌ల గురించి తేల్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఈ నేప‌థ్యంలో క‌విత ట్వీట్ ఆలోచ‌నాత్మ‌కంగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతం ఉంద‌ని ఆమె గుర్తు చేశారు. అలాగే ప్ర‌తి ఏడాది యువ‌త‌కు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్న బీజేపీ హామీ ఏమైంద‌ని క‌విత నిల‌దీశారు. మోస‌పూరిత హామీతో యువ‌త‌ను ద‌గా చేసిన‌ట్టు క‌విత ధ్వ‌జ‌మెత్తారు. నిజమైన డిగ్రీ అర్హ‌త ఉన్నవాళ్లకు ఉద్యోగాలు రావ‌ని, కానీ డిగ్రీ లేని వ్యక్తికి మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉంద‌ని వ్యాఖ్య‌తో ప్ర‌ధాని మోదీని క‌విత ప‌రోక్షంగా దెప్పి పొడిచారు.

ప్ర‌ధాని మోదీ విద్యార్హ‌త అంశం బీజేపీని పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. పాలించే నాయ‌కుడి విద్యార్హ‌త‌ల గురించి అడిగితే చెప్ప‌క‌పోవ‌డం ఏంట‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది. మోదీ విద్యార్హ‌త‌ను దాచే కొద్ది మ‌రింత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంద‌న్న సంగ‌తిని బీజేపీ నేత‌లు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.