కాస్ట్ కటింగ్.. గూగుల్ ఉద్యోగుల సౌకర్యాలు తగ్గింపు

గూగుల్.. ఉద్యోగులకు స్వర్గధామం. గూగుల్ లో జాబ్ అంటే అదొక స్టేటస్ సింబల్. అందుకు తగ్గట్టుగానే ఆ సంస్థ, తమ ఉద్యోగుల్ని చూసుకుంటుంది. జీతంతో పాటు, గూగుల్ లో ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, అలవెన్సులు…

గూగుల్.. ఉద్యోగులకు స్వర్గధామం. గూగుల్ లో జాబ్ అంటే అదొక స్టేటస్ సింబల్. అందుకు తగ్గట్టుగానే ఆ సంస్థ, తమ ఉద్యోగుల్ని చూసుకుంటుంది. జీతంతో పాటు, గూగుల్ లో ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, అలవెన్సులు భారీగా ఉంటాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వీటిలో చాలా సౌకర్యాలకు చెక్ పెట్టింది ఆ సంస్థ.

ఇకపై గూగుల్ ఆఫీసుల్లో ఉద్యోగులకు స్నాక్స్ ఇవ్వరు. ఈ మేరకు కొన్ని సెగ్మెంట్లలో మైక్రో కిచెన్ విభాగాన్ని మూసివేస్తున్నట్టు ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది గూగుల్. వీటితో పాటు మరిన్ని కాస్ట్ కటింగ్ చర్యల్ని నివేదించింది.

గూగుల్ ఉద్యోగులకు అందించే ఉచిత ఫిట్ నెస్ తరగతుల్ని కూడా రద్దు చేసింది ఈ సంస్థ. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఇచ్చే అలవెన్సుల్ని కూడా నిలిపివేసింది. ఇకపై కేవలం ప్రాధాన్యత క్రమంలో మాత్రమే నిధుల్ని ఖర్చుపెడతామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రకటించారు.

రాబోయే రోజుల్లో గూగుల్ ఆఫీసుల సైజులు కూడా తగ్గుతాయని ప్రకటించారు. కొన్ని ఆఫీసుల్ని మూసేసి, అందులో ఉన్న ఉద్యోగుల్ని, మరికొన్ని ఆఫీసుల్లో సర్దుబాటు చేస్తారు. ఈ మేరకు డెస్క్ సైజును కుదించుకోవాల్సి ఉంటుందని, లేదా మరో ఉద్యోగితో షేర్ చేసుకోవాల్సి ఉంటుందని ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చారు.

గూగుల్ లో ఇప్పటికే ఉద్యోగాల తొలిగింపు (లే-ఆఫ్ లు) ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12వేల మంది ఉద్యోగుల్ని తొలిగిస్తామని, స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 6 శాతం.