ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన 'మూడు రాజధానులు' బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేసుకున్న తరువాత మరో కీలకమైన బిల్లు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఇది ప్రతిపక్ష టీడీపీ నేతలు పదేపదే కోరుకున్నదే. అదే అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణ. నిజానిజాల వెలికితీత. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీకి చెందిన బడా నేతల గుట్టు బయటపెట్టడం. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుంభకోణాన్ని బయటపెట్టడానికి సంబంధించిన విచారణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సంబంధించిన తీర్మానాన్ని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేపెట్టారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని సబ్ కమిటీ విచారణలో తేలింది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, దోషులని తేలినవారికి శిక్షలు విధించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మొన్న మూడు రాజధానులు బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి ఉన్న కారణాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కూడా ఒకటి. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజున ఇన్‌సైడర్ ట్రేడింగ్ మీద కూడా చర్చ జరిగింది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దీనిపై సుదీర్ఘంగా వివరించాడు. ఎవరెవరు ఎంతెంత భూములు కాజేశారో పూర్తి వివరాలు చదివి వినిపించారు. గతంలోనూ ఇవే వివరాలు ఒకసారి సభలో తెలియచేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు ఇదివరకే డిమాండ్ చేశారు. అసెంబ్లీలోనూ ఆయన, ఇతర నేతలు కూడా మీ ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపించుకోండని, భయపడేది లేదని చెప్పారు. అయితే టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ ఛానెళ్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుంభకోణం కాదని చెబుతూనే జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఇప్పటివరకు ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించాయి. కొంతకాలం కిందట ఓ టీవీ చర్చలో పాల్గొన్న వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇన్‌సైడర్ ట్రేడింగ్ గుట్టు బయటపెట్టడం కష్టమన్నట్లుగా మాట్లాడారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెటుకు సంబంధించిన వ్యవహారమని, దీన్ని భూముల వ్యవహారానికి అన్వయింపచేయడం కుదరదని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ విచారణకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టం లేదని, ముందుగా దాన్ని రూపొందించాలని అన్నారు. కొందరేమో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బినామీ చట్టాన్ని ఉపయోగించి విచారణ చేయవచ్చంటున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెబుతూనే విచారణ చేసుకున్నా తాము భయపడేది లేదంటున్నారు. విశాఖలోనూ గత ఏడు నెలలుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, జగన్, కొందరు మంత్రులు అక్కడ వేల ఎకరాలు కొనుగోలు చేశారని, దమ్ముంటే దానిపై కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈమధ్య 'సాక్షి' పత్రికలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి రెండు కథనాలు ప్రచురించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన నాయకుల, సంస్థల పేర్లు, భూముల వివరాలు ప్రచురించారు. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి సంచలనం సృష్టించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ మొదలుపెడితే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.