కూతురికి ప్రేమతో.. హీరో ఎమోషనల్ లెటర్

కన్నకూతుర్ని హఠాత్తుగా కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. తన చేతులపై పెంచిన కూతురు మీరా, తమ కళ్లముందే కన్నుమూయడంతో ఆ…

కన్నకూతుర్ని హఠాత్తుగా కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. తన చేతులపై పెంచిన కూతురు మీరా, తమ కళ్లముందే కన్నుమూయడంతో ఆ హీరో తట్టుకోలేకపోయాడు. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు.

అలా 3 రోజులుగా శోకసంద్రంలో మునిగిపోయిన విజయ్ ఆంటోనీ, ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చాడు. తన కూతురు మరణంపై స్పందించాడు. కూతురిపై ప్రేమతో, విజయ్ ఆంటోనీ పెట్టిన ఆ పోస్టు, అందర్నీ కలచివేస్తోంది.

డబ్బు, అసూయ, కులం-మతం, బాధ, పేదరికం, ద్వేషంతో నిండిన ఈ లోకం నుంచి మరో మెరుగైన, ప్రశాంతమైన ప్రపంచానికి తన కూతురు వెళ్లిపోయిందంటూ బాధతో ప్రకటించాడు విజయ్ ఆంటోనీ. తను కూడా ఆమెతో చనిపోయానని అన్నాడు. ప్రస్తుతం తను, తన కూతురితో మాట్లాడుతున్నానని, ఆమె కోసం సమయం కేటాయిస్తున్నానని తెలిపాడు.

ఇక నుంచి ఏం చేసినా, అది తన కూతురి కోసమేనని ప్రకటించాడు ఈ హీరో. ఇకపై చేయబోయే ప్రతి పనిని, కూతురి పేరిట మొదలు పెడతానని తెలిపాడు. పెట్టింది 3-4 వాక్యాలే అయినప్పటికీ, అందులో బాధ, లోతు చాలామందికి అర్థమైంది. విజయ్ ఆంటోనీ పోస్టు చదివిన ప్రతి ఒక్కరి మనసు బరువెక్కిపోతోంది.

విజయ్ ఆంటోనీ కూతురు 16 ఏళ్ల మీరా, డిప్రెషన్ తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గదిలో ఆమె రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె 'లవ్ యు ఆల్.. మిస్ యు ఆల్' అని రాసిందని తెలిపారు. అంతకుమించి లెటర్ లో ఏముందో వెల్లడించలేదు.