సిక్కోలు అని అంతా ముద్దుగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు వారి రాజకీయ ప్రభ ఎలా వెలుగుతుందో అందరికీ తెలిసిందే. స్వర్గీయ ఎర్రన్నాయుడుతో మొదలుపెడితే అచ్చెన్నాయుడు, రామ్మోహననాయుడు తమ హవాను అలా చాటుకుంటూ వస్తున్నారు.
ఇక కింజరాపు వారి సొంత గ్రామం నిమ్మాడ. అక్కడ మరి నూటికి నూరు శాతం టీడీపీ గొంతులే పలుకుతాయి అని అనుకుంటారు కదా. కానీ తాజా రాజకీయ సమీకరణలలో భాగంగా నిమ్మాడలో కూడా జై జగన్ అనే సీన్ కనిపిస్తోందిట.
జగన్ పాదయాత్రలు మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా టెక్కలి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ పాదయాత్ర చేపడితే కింజరాపు కోట వైసీపీ ప్రకంపనలతో ఊగిపోయిందట. అంతే కాదు, నిమ్మడలో వైసీపీ మీటింగ్ పెట్టి మరీ జగన్ జయ జయ ధ్వానాలు వినిపించిన ఘనత దువ్వాడదేనని అంటున్నారు.
ఇక టెక్కలిలో ఒక ప్రభంజనంగా దువ్వాడ పాదయాత్ర సాగుతోంది. అక్కడ మహిళలు ముందుకొచ్చి మంగళ హారతులు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏపీ ప్రెసిడెంట్ హోదాకు ఎగబాకిన తరువాత అచ్చెన్న కంచు కోటలో ఇలాంటి కీలక మార్పులు రావడం షాకింగ్ పరిణామమే.
వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నను ఓడించి తీరుతాను అని దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న శపధానికి తగినట్లుగానే మహిళా లోకం స్పందిస్తోంది మరి. ఇక టెక్కలి లో భారీ రాజకీయ మార్పు జరుగుతుందా. చూడాలి మరి.