బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తే.. కమలం పార్టీ సర్దుకోవాల్సిన వ్యవహారాలు చాలానే ఉన్నట్టున్నాయి. ఒకవైపు ఈ మధ్యకాలంలోనే ఒకటీ రెండు పార్టీలు ఎన్డీయే నుంచి వైదొలిగాయి. అందులో శిరోమణి అకాళీదల్ వంటి పార్టీ కూడా ఉంది. ఇప్పుడు బిహార్ లో బీజేపీతో పాటు జేడీయూ కూడా దెబ్బతింటే.. కమలం పార్టీకి అది పెద్ద ఝలక్ అవుతుంది.
ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ముందున్నాయి. తమిళనాడులో కమలం పార్టీది ప్రేక్షక పాత్రే. బెంగాల్ లో మాత్రం సత్తా చూపడానికి ఉబలాటపడుతూ ఉంది. బిహార్ లోనే సత్తా చూపలేకపోతే బెంగాల్ లో చూపగలరా? అనేది కీలకమైన ప్రశ్న.
ఆ సంగతలా ఉంటే.. తమ ఇంట కూడా బీజేపీ కొన్ని సర్దుకోవాలని భావిస్తోందట. అదే కర్ణాటక వ్యవహారం. అక్కడ ముఖ్యమంత్రి యడియూరప్ప ను మార్చాలనే ఉద్దేశంతో ఉందట కమలం పార్టీ. ఈ విషయంలో ఇప్పటికే పలువురు కన్నడ బీజేపీ నేతలు స్పందించారు. యడియూరప్పను అధిష్టానం దించేస్తుందని, మరో లింగాయత్ నేతను సీఎంగా చేస్తుందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక బీజేపీ వ్యవహారాలు మొత్తం ఢిల్లీ నుంచినే సాగుతున్నాయి!
యడియూరప్ప పేరుకు మాత్రమే సీఎం. కేబినెట్ విస్తరణ గురించి ఆయన పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఢిల్లీ కి వెళ్లడం, రావడం జరుగుతూ ఉంది కానీ, తనకు కావాల్సినట్టుగా మంత్రి వర్గాన్ని కూడా ఏర్పరుచుకోలేకపోతున్నారు. బిహార్ ఫలితాలు రాగానే మరోసారి ఢిల్లీకి వెళ్లి కేబినెట్ కు అధిష్టానం ముద్ర వేయించుకోవడానికి యడియూరప్ప తాపత్రయపడుతున్నారట.
ఒకవేళ బిహార్ లో బీజేపీ నెగ్గితే యడియూరప్పను అధిష్టానం కచ్చితంగా పక్కన పెడుతుందనేది చందన సీమలో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఒకవేళ బిహార్ లో ఎదురుదెబ్బ తగిలితే ఇప్పుడు కర్ణాటకలో యడియూరప్పను పక్కన పెట్టే సాహసం చేసే అవకాశాలు తక్కువేనట.
ఇలా యడియూరప్ప సీటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మీద ఆధారపడి ఉందని టాక్. బిహార్ లో ఓడితే బీజేపీ అధిష్టానం చర్యలు కాస్త డిఫెన్సివ్ గా ఉంటాయి, లేకపోతే మరోలా ఉంటాయని యడియూరప్ప గ్రూప్ భావిస్తోందని కర్ణాటక పత్రికలు పేర్కొంటున్నాయి.