అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత టీడీపీలో అంతర్గత రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీలో అచ్చెన్న వర్గం, లోకేష్ వర్గం అంటూ రెండు తయారయ్యాయి.
గతంలో ఎప్పుడూ లేనట్టుగా.. పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులతో నేరుగా అచ్చెన్న టచ్ లోకి వెళ్తున్నారు. కళా వెంకట్రావు జమానా పోయిందని, ఇకపై అందరూ తన అండర్ లో పనిచేయాలని ఆదేశాలు కూడా ఇచ్చేశారట.
బాబాయ్ దూకుడు అలా ఉంటే.. ఇక అబ్బాయ్ ఎందుకు వెనక్కు తగ్గుతారు చెప్పండి. అందులోనూ లోకేష్ మంత్రి పదవిలో ఉండి కూడా ఓడిపోయిన నాయకుడు, రామ్మోహన్ గెలిచిన నాయకుడు. ఆ ధైర్యంతోనే గతంలో ఓసారి సోషల్ మీడియా వేదికగా కాలరెగరేశారు రామ్మోహన్ నాయుడు.
ఏపీ టీడీపీకి రామ్మోహన్ నాయుడిని అధ్యక్షుడిని చేయాలంటూ ఆయన అభిమానులు వీరంగం వేశారు కూడా. అదో పెద్ద ఉపద్రవంలా మారే టైమ్ లో లోకేష్ బాధ చూడలేక చంద్రబాబు తోక కత్తిరించారు.
ఇప్పుడు బాబాయ్ అచ్చెన్నాయుడు అధ్యక్షుడయ్యాక మరోసారి అబ్బాయ్ తన 'మార్క్' చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర వేదికగా కొత్త ఉద్యమాన్ని మొదలు పెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విడగొట్టొద్దనేది రామ్మోహన్ డిమాండ్.
ఆయన ఒక్కరి డిమాండ్ వల్ల ఒరిగేదేమీ లేదని, ఆ ఒక్క జిల్లాను విభజించకుండా ఉండటం సాధ్యం కాదని ఆయనకీ తెలుసు. అయినా రాష్ట్రవ్యాప్త అటెన్షన్ కోసం, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తన పరపతి కోసం సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం మొదలు పెట్టారు.
జిల్లా విభజన వల్ల కలిగే నష్టాలు వివరిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు రామ్మోహన్. రాజకీయ కారణాలతో జిల్లాల విభజనను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. 2026లో జరగనున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మరోసారి 25 జిల్లాలను విభజిస్తారా అంటూ లాజిక్ లేకుండా ప్రశ్నిస్తున్నారు రామ్మోహన్ నాయుడు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనే తేనెతుట్టె ఎవరు కదిపినా అవే వారికి చివరి ఎన్నికలనడంలో అనుమానం లేదు. అందుకే ఎన్డీఏ ఆ సాహసానికి పూనుకోదు. అంటే రామ్మోహన్ ప్రశ్నలో అర్థం లేదు. అయినా కూడా ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించేందుకే ఇలా జిల్లా పేరు చెప్పి రెచ్చిపోతున్నారు, టీడీపీలో ఉన్న నాయకత్వ శూన్యతను భర్తీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి రామ్మోహన్ ని చంద్రబాబు మందలిస్తారా? లేక.. తన కొడుకు కంటే ఎక్కువగా ఎదగనిస్తారా..? వేచి చూడాలి.