ముద్దుగుమ్మ పూజాహెగ్డే తన హెడేక్ తగ్గించుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇటీవల మాటజారి అనవసరంగా నెత్తి మీదకు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండిస్ట్రీ వాళ్లకు నడుమంటే వ్యామోహమని, హీరోయిన్లను మిడ్ డ్రస్‌లలో చూడ్డానికి ఇష్టపడతారని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో నెటిజన్లు పూజాను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే తాను అన్న మాటలపై వివరణ ఇస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ, అభిమానాన్ని కాదని తేల్చి చెప్పారు. తనకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే అన్ని వేళలా ప్రాణమన్నారు.
ఈ విషయం తన సినిమాలను అభిమానించే వారికి, అలాగే తన అభిమానులకి తెలిసినా, వివాదం రేగిన నేపథ్యంలో అపార్థాలకు తావు లేకుండా మరోసారి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను విడుదల చేశారు.
తనకు కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన టాలీవుడ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన ఇంటర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థమవుతాయని సలహా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకులు సినిమా వాళ్లను ఆరాధిస్తారని, దేవుళ్లగా పూజిస్తారని చెప్పారు.
‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ‘దక్షిణాది వాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్టు సమాధానం ఇచ్చారు. తనకు మాత్రం ఎవరైనా తన కాళ్లు చూస్తే బావుంటుందని అనుకుంటానని, నడుము మాత్రం కాదని పూజా హెగ్డే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
పూజా హెగ్డే వివరణతోనైనా వివాదం సర్దుమణుగుతుందో లేదో చూడాలి మరి!