ఇంట్లో మీ పిల్లలు మీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? వాళ్లకు కావాల్సిన యాప్స్ ను మీ ఫోన్ లోనే డౌన్ లోడ్ చేసి ఆడుకుంటున్నారా? అయితే మీ బ్యాంక్ ఎకౌంట్ రిస్క్ లో పడినట్టే. మీ జేబుకు చిల్లు పడినట్టే. నాగ్ పూర్ లో జరిగిన ఓ సైబర్ మోసం తల్లిదండ్రులకు ఓ పెద్ద వార్నింగ్ ఇచ్చింది.
నాగపూర్ లో అశోక్ మన్వాటే ఓ చిన్న వ్యాపారవేత్త. ఇంట్లో తండ్రి ఉండే సమయంలో అతడి మొబైల్ ఫోన్ ను 15 ఏళ్ల కొడుకు ఉపయోగిస్తుంటాడు. అందులో గేమ్స్ ఆడడం, సరదా యాప్స్ డౌన్ లోడ్ చేయడం లాంటివి చేస్తుంటాడు.
ఓరోజు ఇలానే అశోక్ మన్వాటే ఫోన్ కు కాల్ వచ్చింది. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ టైమ్ లో ఫోన్ అశోక్ కొడుకు చేతిలో ఉంది. కాల్ రిసీవ్ చేసుకున్న అశోక్ కొడుకు, అవతలి వ్యక్తి చెప్పినట్టుగానే ఓ చిన్న యాప్ ను డౌన్ లోడ్ చేశాడు.
అంతే.. నిమిషంలో అశోక్ ఖాతా నుంచి ఏకంగా 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న అశోక్ లబోదిబోమన్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రిమోట్ డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ ఆధారంగా సైబర్ మోసగాడు.. ఎకౌంట్ ను యాక్సెస్ చేసి డబ్బులు కొల్లగొట్టినట్టు గుర్తించారు.
తల్లిదండ్రులకు ఇదొక పెద్ద హెచ్చరిక. ఒకప్పుడు పిల్లలకు ఫోన్ ఇచ్చి పోర్న్ సైట్స్, హాని కలిగించే గేమ్స్ ఆడకుండా మాత్రమే జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ వాటికి అదనంగా అవాంఛనీయ యాప్స్ డౌన్ లోడ్ చేయకుండా కూడా పిల్లల్ని కట్టడి చేయాలి.
తమ ఫోన్ కు వచ్చే కాల్స్ ను ఎత్తి మాట్లాడాల్సిందిగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.