ట్రంప్ జగమొండి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని మొండిగా వాదించడం ఆయన ప్రత్యేకత. దేశాధ్యక్ష పదవికి జరిగిన ఉత్కంఠ పోరులో చివరికి ట్రంప్ ప్రత్యర్థి జోబైడెన్‌ను విజయం వరించింది.
రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. ఓటమిని హూందాగా స్వీకరించాల్సిన ట్రంప్ ఆ పని చేయకపోగా …చేజారిన పదవి తనదేనని చిన్న పిల్లాడిలా వాదిస్తున్నారు. ఇది సరైంది కాదని సొంత పార్టీ పెద్దలు చెబుతున్నా వినిపించుకునే పరిస్థితిలో ఆయన లేరు.
ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, తాను ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు విషయమై ఆ దేశ న్యాయస్థానాల్లో కూడా చుక్కెదురైంది. అయినా ట్రంప్ పట్టు వీడలేదు.
ఇతరేతర వేదికల నుంచి ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓడినా మొండిపట్టుదలతో వ్యవహరించడం మంచిది కాదని అల్లుడు కుష్నర్ మామకు హితవు చెబుతున్నట్టు వార్తలొచ్చాయి.
ఇప్పుడు అల్లుడి వరుసులో ట్రంప్ భార్య మెలానియా కూడా చేరారు. ఓటమిని హూందాగా స్వీకరించి వైట్‌హౌస్ నుంచి గౌరవంగా వెళ్లిపోదామని చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ పెళ్లాం మాటల్ని కూడా ఆయన లెక్క చేయలేదని తెలుస్తోంది.