వివాహేతర సంబంధమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు దారి తీసిందని సమాచారం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లి సమీపంలో శనివారం అర్థరాత్రి కారు దగ్ధమైంది. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి కాలి బూడిదయ్యాడనే వార్తలొచ్చాయి. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆచూకి లభ్యమైంది. మృతుడు నాగరాజుగా గుర్తించారు.
చంద్రగిరి నుంచి అనుప్పల్లికి వెళ్లే మార్గంలో గంగుడుపల్లి సమీపంలో కారు దగ్ధమవుతున్న విషయమై చంద్రగిరి పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో ఒక బంగారు చైన్‌ను, పెట్రోల్ క్యాన్‌ను పోలీసులు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా మృతుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి నివాసి నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
టీడీపీ నాయకుడి భార్య సర్పంచ్. ఆమెతో నాగరాజుకు వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. నాగరాజు అర్ధరాత్రి సమయంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా, దుండగులు హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుల ఆచూకీ గురించి ఇప్పటికే పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసుల దర్యాప్తులో హత్యకు దారి తీసిన పరిస్థితులు వెలుగులోకి రానున్నాయి.