పెళ్లన్న తర్వాత ఏవో సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి పెద్ద మనుషుల జోక్యంతో లేదా న్యాయస్థానాల సలహాతో మళ్లీ కలసి జీవిస్తుంటారు. మరికొన్ని జంటలు విడాకులు తీసుకుని ఎవరికి వారు ప్రశాంతంగా, తమకిష్టమైన జీవితాన్ని సాగించాలనుకుంటారు. ఇక కలిసి జీవితాన్ని పంచుకోలేమనే పరిస్థితుల్లోనే విడాకులు తీసుకుంటారనేది నిజం. కానీ నటి శ్వేతాబసు మాత్రం ఎంతో ప్రేమగా ఉంటూ విడిపోతున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత అంశం. అందులో రెండో అభిప్రాయానికి తావులేదు. కానీ తన వైవాహిక జీవితానికి సంబంధించి శ్వేతాబసు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మాట్లాడుకోవాల్సి వస్తోంది.
‘మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా, నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అందువల్లే విడాకులు తీసుకుంటున్నాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్ నటించారు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారామె. శ్వేతాబసు 2018లో రోహిత్ మిట్టల్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి దాంపత్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయమై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు.
అంతే కాదు అతనో అద్భుత దర్శకుడని, ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముందని వెల్లడించారు. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని పేర్కొన్నారామె. పుస్తకం , చెడ్డ పుస్తకం, అసంపూర్ణ పుస్తకం …ఇలా పొంతన లేని పోలికలు ఏమిటో అసలు అర్థం కాదు. అసలు విషయం కాకుండా ఏదేదో చెప్పడం శ్వేతాబసులాంటి వారికే చెల్లింది. ఏమోలేమ్మా…మీ జీవితం మీ ఇష్టం.