వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యమని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈ సవాల్ ద్వారా తను గతంలో చేసిన ఒక సవాల్ గుర్తు చేస్తూ ఉండటం గమనార్హం. పవన్ కల్యాణ్ కు ఇలాంటి సవాళ్లు చేయడం కొత్త ఏమీ కాదు. తన మాటనే శాసనం అని ఆయన ప్రకటించుకున్నారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ ఇలాంటి సవాల్ ఒకటి విసిరాడు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే, ఆ పార్టీ అధినేత జగన్ గురించినే.
గత ఏడాది అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు పవన్ కల్యాణ్ ఒక ప్రతిన బూనారు. ఒక సవాల్ విసిరారు. అదేమిటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాలేరు అని అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ వైరల్ గానే ఉంటాయి. తన మాటే శాసనం అని బాహుబలిలో రమ్యకృష్ణ లెవల్లో ప్రకటించుకున్నారు పవన్ కల్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాలేరని అప్పట్లో పవన్ తేల్చి చెప్పారు.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 151 సీట్ల మెజారిటీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం సమయంలో పవన్ కల్యాణ్ కూడా శుభాకంక్షలు చెబుతూ ఏదో ఒక వీడియో వదిలాడు. ఆ తర్వాతేమో తను జగన్ ను సీఎంగా గుర్తించనని పవన్ ప్రకటించాడు. పవన్ కల్యాణ్ గుర్తించనంత మాత్రాన జగన్ కు వచ్చే నష్టం ఏమీఏ లేదు, రాష్ట్రానికీ నష్టం లేదు. పవన్ కల్యాణ్ అలా ఫూల్స్ ప్యారడైజ్లో ఉంటే ఆయనకే నష్టం.
అయితే దాని నుంచి పవన్ కల్యాణ్ ఇప్పటికీ బయటకు వచ్చినట్టుగా లేరు. అందుకే ఒక్క ఎమ్మెల్యే పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ , కూల్చేవరకూ నిద్రపోనంటూ ప్రకటనలు చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకటన కూడా గతంలో జగన్ గురించి పవన్ చేసిన ప్రకటననే గుర్తు చేస్తూ ఉంది. బహుశా అది కామెడీ అయినట్టే, ఇది కూడా కామెడీలానే ఉంది!