అల వైకుంఠపురములో సినిమా విడుదలయింది. బ్లాక్ బస్టర్ అయింది. దర్శకుడు త్రివిక్రమ్ కు, హీరో బన్నీకి, మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు బోలెడు ప్రశంసలు దక్కాయి. కానీ అస్సలు సమీక్షల్లో కానీ, ఎక్కడా కానీ వినిపించని పేరు మరోటి వుంది. కనిపించని కష్టం ఇంకొరకరిది వుంది. ఆ పేరే నవీన్ నూలి. సినిమాకు పని చేసిన ఎడిటర్.
టాలీవుడ్ లో లేటెస్ట్ గా యంగ్ హీరోల సినిమాలు అన్నింటికీ పని చేస్తున్నది నవీన్ నూలి నే. అంత మాత్రం చేత అల వైకుంఠపురములో సినిమాకు ప్రత్యేకమైన కష్టం ఏం పడ్డాడు అనే క్వశ్చను రావచ్చు. కానీ ఇక్కడ సమస్య, పాయింట్ అది కాదు. సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్. ఆయనే కాదు, ఆయన రేంజ్ దర్శకులు అంతా తీసే ఫుటేజ్ తక్కువ వుండదు. కావాల్సిన దానికన్నా కనీసం మరో గంట ఎక్కువే వుంటుంది.
అల వైకుంఠపురములో సినిమాకు కూడా అలా ఎక్సెస్ ఫుటేజ్ చాలానే వచ్చిందని భోగట్టా. దాన్ని అంతా ఓ పద్దతిగా కట్ చేసి, ముందుగా మూడు గంటల మేరకు తీసి రఫ్ కట్ చేసింది నవీన్ నే. ఆ తరువాత మళ్లీ త్రివిక్రమ్ సలహా సూచనల మేరకు ఎక్కడిక్కడ స్మూత్ గా ఎడిట్ చేస్తూ నిడివి తగ్గించుకుంటూ వచ్చింది నవీన్ నే.
ఇక్కడ ఇంకో సమస్య వుంది. డైరక్టర్లకు తాము తీసిన దానిని విపరీతంగా ప్రేమిస్తారు. అంత సులువుగా సీన్లు లేపేయడానికి అంతగా ఇష్టపడరు. అల వైకుంఠపురములో సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. తివిక్రమ్ తను తీసిన దాన్ని తానే ట్రిమ్ చేయడం అంటే చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. ఆఖరికి ఆడియన్స్ పల్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాను దగ్గర వుండి ఎడిట్ చేయించారు.
ఇలా సీన్లు లేపుతూ వుంటే ఎడిటింగ్ అంతకు అంతా కత్తి మీద సాముగా వుంటుంది. ఎక్కడా జంప్స్ రాకూడదు. కంటిన్యూటీ చెడకూడదు. ఇవన్నీ చూసుకుంటూ నవీన్ నూలి సినిమాను ఎడిట్ చేసుకుంటూ వచ్చారు. ఇవ్వాళ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఏ తేడా అనిపించకుండా వుందీ అంటే దాని వెనుక అందరితో పాటు, నవీన్ కష్టం కూడా వుంది.