రోజూ ఓ కథ చెప్పి చెట్టెక్కేసే విక్రమార్క భేతాళ కథలా తయారయింది అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా సంగతి. ఎప్పటికీ ఏదో ఒక పని ఇంకా బకాయి వుంటూనే వుంటుంది. సినిమా విడుదల మూడు వారాల దూరంలోకి వచ్చేసింది.
ఇప్పటి వరకు రెండు పాటలు వదలడం మినహా పెద్ద ప్రచారం పని మొదలు పెట్టలేదు. ఆ రెండు పాటలు కూడా మరీ అద్భుతంగా వైరల్ అయిపోలేదు. సరైన హిట్ లేని హీరో మీద, కేవలం డైరక్టర్ కాంబినేషన్ నమ్మి, 80 కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాత అనిల్ సుంకర. ఇలాంటపుడు మాంచి ఓపెనింగ్ కోసం గట్టి ప్రచారం చేయాల్సి వుంటుంది.
కానీ ఈ నెల 28న విడుదల అవుతుందా? కాదా? అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పక్కాగా విడుదల చేస్తామని యూనిట్ అంటోంది. కానీ పని చూస్తే ఇంకా వుంటూనే వుంది. కొచ్చి, ముంబాయిల్లో ప్యాచ్ వర్క్ వుంది. అది ఈ వారంలో పూర్తవుతుంది అంటున్నారు. ఒక పాట షూట్ బకాయి వుంది. కాదు రెండు పాటలు షూట్ చేయాలనీ వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా వుంటే సిజి పనులు ఇంకా జరుగుతూనే వున్నాయి. తొలిసగం రీ రికార్డింగ్ పూర్తయింది. మలి సగం ఆర్ఆర్ అందివ్వాలి అని తెలుస్తోంది. ఆపై మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మామూలే.
నిర్మాత అక్కడే కూర్చుని తరిమితే తప్ప జరిగే వ్యవహారం కాదు ఇవన్నీ డెడ్ లైన్ లోపల. కానీ నిర్మాత అమెరికాలో వుంటారు. మరి అనుకున్నట్లు ఈ నెల 28 కి రాకపోతే ఏజెంట్ కు మరి సరై న డేట్ అన్నది లేదు. చాలా కష్టం అవుతుంది పరిస్థితి. నిర్మాత అనిల్ సుంకర ఏం చేస్తారో? దర్శకుడు సురేందర్ రెడ్డి మనసులో ఉద్దేశమేమిటో?