డ్రగ్స్ కేసు.. నవదీప్ కు నోటీసులు

మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే నవదీప్ కు ప్రతికూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ వెంటనే నార్కోటిక్ బ్యూరో తమ విచారణను వేగవంతం చేసింది. హైకోర్టు సూచనల మేరకు, డ్రగ్స్ కేసుకు సంబంధించి…

మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే నవదీప్ కు ప్రతికూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ వెంటనే నార్కోటిక్ బ్యూరో తమ విచారణను వేగవంతం చేసింది. హైకోర్టు సూచనల మేరకు, డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నవదీప్ ఇంటికెళ్లి నోటీసులిచ్చారు అధికారులు. నోటీసు ప్రకారం, ఎల్లుండి నవదీప్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. దీన్ని నవదీప్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో నవదీప్ ను 29వ నిందితుడిగా చేర్చారు నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆ వెంటనే నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ వెంటనే పోలీసులు తమ వాదన వినిపించారు. గతంలో కూడా నవదీప్ పై వచ్చిన ఆరోపణల్ని కోర్టుకు విన్నవించారు. దీంతో 41ఏ కింద నవదీప్ కు నోటీసులిచ్చి విచారించేందుకు, పోలీసులకు హైకోర్టు అనుమతినిచ్చింది. అలా హైకోర్టు నుంచి అనుమతి వచ్చిన గంటల వ్యవథిలోనే నవదీప్ కు నోటీసు జారీచేసింది నార్కోటిక్ బ్యూరో.

మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లోని ఓ ఫ్లాట్ లో ఆగస్ట్ 31న జరిగిన పార్టీలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, అరెస్టైన వ్యక్తుల్లో రామ్ చంద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నవదీప్ ను కార్నర్ చేశారు. రామ్ చంద్, నవదీప్ స్నేహితులు.

నిందితుల జాబితాలో 29వ స్థానంలో ఉన్నప్పటికీ, ఆధారాలు పక్కాగా ఉండడంతో, నవదీప్ కు నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వెంకట రత్నారెడ్డి నుంచి మాదకద్రవ్యాలు బయటకొచ్చాయి. వాటిని మాజీ ఎంపీ విఠల్ రావు కొడుకు దేవరకొండ సురేష్ కొనుగోలు చేశాడంట. అతడి నుంచి కొల్లి రామ్ చంద్, అతడి నుంచి నవదీప్ కు మాదకద్రవ్యాలు చేరినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.

నవదీప్ డ్రగ్స్ సేవిస్తున్నాడా లేక సరఫరా చేస్తున్నాడా అనే కోణంలో పోలీసులు అతడ్ని విచారించే అవకాశం ఉంది. డ్రగ్స్ సరఫరాదారుడిగా తేలితే మాత్రం ఈ నటుడు ఇబ్బందుల్లో పడినట్టే.