ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? కోలీవుడ్ సూపర్ హిట్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్. మహేష్ కు ఈ దర్శకుడు కచ్చితంగా హిట్ ఇస్తానంటున్నాడు. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పేరు స్పైడర్.
అది 2017.. మహేష్-మురుగ కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు చేతిలో గన్ తో మహేష్ నిల్చున్న స్టిల్ రిలీజ్ అవ్వడం, టాలీవుడ్ జేమ్స్ బాండ్ పాత్రలో మహేష్ కనిపించనున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
కానీ రిలీజైన మొదటి రోజే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ప్రేక్షకులు ఏదో ఊహించుకున్నారు, సినిమాలో ఇంకేదో ఉంది. ఇదే విషయాన్ని ఈరోజు మురుగదాస్ ప్రస్తావించాడు. అంచనాల్ని అందుకోలేకపోయామన్నాడు, ఏదో ఒక రోజు మహేష్ కు హిట్టిస్తానంటున్నాడు.
“మహేష్ బాబుతో తప్పకుండా మరో సినిమా చేస్తా. ఆయనకు హిట్ ఇస్తా. ప్రతి సినిమాకు ఒకేలా కష్టపడతాం. కాకపోతే ప్రేక్షకుల అంచనాలకు, మా క్రియేషన్ జాయింట్ చేస్తేనే సినిమా హిట్టవుతుంది. ఆ అంచనాల్ని అందుకోలేకపోయాం. అంతేతప్ప, మా కష్టంలో ఎలాంటి తేడా లేదు.”
ఇలా స్పైడర్ గాయాన్ని గుర్తుచేసుకున్నాడు ఈ కోలీవుడ్ డైరక్టర్. పనిలోపనిగా అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమాపై కూడా స్పందించాడు. తామిద్దరం పలు సందర్భాల్లో కలుసుకున్నామని, కొన్ని కథలపై మాట్లాడుకున్నామని, కానీ ప్రాజెక్టు మాత్రం స్టార్ట్ అవ్వాల్సిన టైమ్ లో స్టార్ట్ అవుతుందని, ఇప్పుడే దాని గురించి చెప్పలేనని అన్నాడు.