మోహన్ బాబుతో కష్టం అంటున్న సీనియర్ హీరో

ఇండస్ట్రీలో స్ట్రిక్ట్ గా టైమ్ ఫాలో అయ్యే వ్యక్తి మోహన్ బాబు. ఉదయం 9 గంటలకు షూటింగ్ అంటే ఠంచనుగా 9 గంటలకు లొకేషన్ లో ఉంటారాయన. ఆయనకున్న ఈ అలవాటు కారణంగా ఓ…

ఇండస్ట్రీలో స్ట్రిక్ట్ గా టైమ్ ఫాలో అయ్యే వ్యక్తి మోహన్ బాబు. ఉదయం 9 గంటలకు షూటింగ్ అంటే ఠంచనుగా 9 గంటలకు లొకేషన్ లో ఉంటారాయన. ఆయనకున్న ఈ అలవాటు కారణంగా ఓ సినిమా కార్యరూపం దాల్చలేదు. అదేంటి.. ఇలాంటి మంచి అలవాటు ఉండే సినిమా మిస్ అవ్వకూడదు కదా? ఇదే మీ సందేహమైతే.. దానికి హీరో రాజశేఖర్ సమాధానం చెబుతున్నారు.

సరిగ్గా 20 ఏళ్ల కిందటొచ్చింది హనుమాన్ జంక్షన్ అనే సినిమా. అర్జున్, జగపతిబాబు హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ అది. నిజానికి ఆ సినిమాలో నటించాల్సింది వాళ్లు కాదు. అర్జున్ స్థానంలో మోహన్ బాబు, జగపతిబాబు స్థానంలో రాజశేఖర్ హీరోలుగా ఉండి చేయాల్సిన సినిమా అది. కానీ రాజశేఖర్ ఆ మూవీ చేయడానికి అంగీకరించలేదు. దానికి కారణం మోహన్ బాబు.

తను 9 గంటలకు షూటింగ్ అంటే నిదానంగా 10 గంటలకు వస్తానని, మోహన్ బాబు మాత్రం 9 గంటలకే వచ్చేస్తారని అన్నారు రాజశేఖర్. టైమ్ విషయంలో తనకు క్రమశిక్షణ లేదని చెప్పిన రాజశేఖర్, మోహన్ బాబుతో హనుమాన్ జంక్షన్ సినిమా చేస్తే, అది పూర్తయ్యేలోపు తమ మధ్య కచ్చితంగా గొడవలొస్తాయని.. అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు.

మోహన్ బాబు సినిమాలో ఉన్నారని తెలియక రాజశేఖర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. ఎప్పుడైతే మోహన్ బాబు ఉన్నారని తెలిసిందో, ఆ వెంటనే తన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చి తప్పుకున్నారట. అలా మోహన్ బాబుతో తనకున్న సత్సబంధాలు పాడవ్వకుండా జాగ్రత్తపడ్డానని అన్నారు. ఇక రాజశేఖర్ లేకపోవడంతో మోహన్ బాబు కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరచలేదు. దీంతో అది చేతులు మారి అర్జున్, జగపతిబాబు చేతికి చేరింది. 

రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టారు ఈ సీనియర్ హీరో.