జ‌గ‌న్‌కు ఎందుకు దూరంగా ఉన్నానో…త్వ‌ర‌లో చెబుతా!

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు రాజ‌కీయ బాంబు పేల్చారు. వైఎస్సార్‌కు ఆత్మ‌గా పేరుగాంచిన కేవీపీ, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. అయితే ఏ కార‌ణం…

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు రాజ‌కీయ బాంబు పేల్చారు. వైఎస్సార్‌కు ఆత్మ‌గా పేరుగాంచిన కేవీపీ, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. అయితే ఏ కార‌ణం వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌లేద‌నే ప్ర‌శ్న‌కు ఇంత వ‌ర‌కూ కేవీపీ స‌మాధానం చెప్ప‌లేదు. కానీ ఆ ప్ర‌శ్న‌కు త్వ‌ర‌లో త‌ప్ప‌క స‌మాధానం చెబుతాన‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం.

విజ‌య‌వాడ‌లో మీట్ ది ప్రెస్‌లో కేవీపీ … వైఎస్సార్‌కు ఆత్మ అయిన మీరు జ‌గ‌న్ వెంట రాజ‌కీయ ప్ర‌యాణం సాగించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంట‌నే ప్ర‌శ్న‌కు స్పందించారు. వైఎస్సార్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న తాను, జగ‌న్‌కు ఎందుకు దూరంగా ఎందుకు ఉన్నానో ఇప్పుడు స‌మాధానం చెప్ప‌బోనన్నారు. అయితే ఏదో ఒక రోజు స‌మాధానం చెప్పాల్సిందే అన్నారు. ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విష‌యాలు వివ‌రిస్తాన‌న్నారు. దీంతో కేవీపీ ఏం చెబుతారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇదిలా వుండ‌గా ఏపీలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయ పార్టీలు మాత్ర‌మే స్పందించ‌లేద‌న్నారు. ఇది సిగ్గుప‌డాల్సిన విష‌య‌మ‌న్నారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. వైసీపీ-బీజేపీ బంధం ఏంటో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.  

ఏపీలో 25 మంది లోక్‌స‌భ‌, 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు, అలాగే 175 మంది ఎమ్మెల్యేలున్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రూ రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని ప్ర‌శ్నించ‌లేదన్నారు. అలాగే తాను ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని, ప్ర‌శ్నించ‌డ‌మే త‌న‌ హ‌క్కు అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెబుతుంటార‌న్నారు. 

ప‌వ‌న్‌కు కూడా ప్ర‌జ‌ల్లో ఎంతోకొంత ఆద‌ర‌ణ ఉంద‌న్నారు. బీజేపీకి ప‌వ‌న్ మిత్ర ప‌క్ష‌మ‌న్నారు. స్నేహ ధ‌ర్మం కార‌ణంగా ప‌వ‌న్ మాట్లాడ‌లేక‌పోవ‌చ్చ‌న్నారు. క‌నీసం అన‌ర్హ‌త వేటు వేసిన విధానం బాగా లేద‌ని ప్ర‌శ్నించ‌క‌పోతే, రేపు ఆ హ‌క్కు కోల్పోతార‌ని ప‌వ‌న్‌కు కేవీపీ హిత‌వు ప‌లికారు. ఇప్పుడు కాక‌పో్తే, మ‌రెప్పుడు ప్ర‌శ్నిస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు.