కరోనా తర్వాత చాలా రంగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కీలకమైన రంగాల్లో మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. ఈ క్రమంలో చూసుకుంటే, ప్రజల్లో భక్తిభావం కూడా కాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. గడిచిన ఏడాదిగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా వంద కోట్ల రూపాయలు దాటడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
గత ఏడాది ఏప్రిల్ నుంచి శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల క్రమం తప్పకుండా వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తోంది. ఏడాదిగా భక్తులు స్వామివారికి భారీగా కానుకలు, హుండీలో డబ్బులు సమర్పిస్తున్నారు. అలా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం హుండీ ద్వారానే టీటీడీకి 1520.29 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
గత నెల మార్చిలో కూడా శ్రీవారికి హుండీ ద్వారా 120.29 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నిన్నటి (మార్చి 31) ఆదాయంతో కలిపి ఈ లెక్కల్ని విడుదల చేసింది టీటీడీ.
ఈ ఆర్థిక సంవత్సరమే అత్యథికం..
ప్రతి ఆర్థిక సంవత్సరం హుండీ ఆదాయాన్ని టీటీడీ బయటపెడుతుంది. అలా ఈ ఆర్థిక సంవత్సరం లభించిన ఆదాయమే అత్యథికం. ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి ఈ స్థాయిలో హుండీ ఆదాయం రాలేదు. ఇక నెలవారీగా చూసుకుంటే.. గతేడాది ఆగస్ట్ లో అత్యథికంగా హుండీ ద్వారా 140.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు అధికారులు ప్రకటించారు.
కరోనాకు ముందు అప్పుడప్పుడు కొన్ని నెలల్లో మాత్రం శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలు దాటేది. కానీ గతేడాది మార్చి నుంచి ప్రతి నెల 100 కోట్ల రూపాయలకు పైగా హుండీ ద్వారా ఆదాయం లభిస్తోంది.