టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నింటికీ ఒకటే స్క్రిప్టు రాసుకుంటున్నారు. ఇది చూడడానికి ఎబ్బెట్టుగా వుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీపై వైసీపీ దాడి చేసినా, వైసీపీపై టీడీపీ దాడికి దిగినా… చంద్రబాబు ఖండన స్క్రిప్టు మాత్రం ఏం మారడం లేదు. సహజంగానే టీడీపీ నేతలపై వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? అని బాబు నిలదీయడం ప్యాషన్‌గా మారింది. ఈయన కొడుకు లోకేశ్ కూడా ఏం తక్కువ తినలేదు. ఇది ఏపీనా? బీహారా? అంటూ లోకేశ్ కూడా ప్రశ్నిస్తుంటారు.
ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. ఇదంతా మీడియా కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఏ నాయకుడైనా బుకాయించాలని ప్రయత్నించినా వెంటనే దొరికిపోతాడు. వాస్తవం ఇలా వుంటే… చంద్రబాబు ఖండన మాత్రం భిన్నంగా వుంది.
‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తు న్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వీడియోని కూడా షేర్ చేశారు. కానీ ఏకపక్షంగా వైసీపీ వాళ్లే దాడులు చేసినట్టే ఎక్కడా లేదు. ఒకరిపై మరొకరు ఇరుపక్షాల నుంచి దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు సవాల్ విసరడంతో వైసీపీ యువ నాయకుడు దూసుకెళ్లాడు.
ఆ తర్వాత అతన్ని టీడీపీ కార్యకర్తలు వెంటపడ్డారు. ఇలా పరస్పరం దాడులు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ట్వీట్ మాత్రం… టీడీపీ వారిపై వైసీపీ దాడికి దిగినట్టు చెప్పడం విడ్డూరం. పల్లె రఘునాథరెడ్డే కారు పైకి ఎక్కి సవాల్ విసురుతున్నట్టు విజువల్స్ ఉన్నాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాత్రం సైలెంట్‌గా అన్ని చూస్తూ ఉండడాన్ని గమనించొచ్చు. గొడవకు దిగాలనే ఉద్దేశంతోనే పల్లె రఘునాథరెడ్డి తన అనుచరులతో వచ్చారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఒక వైపు నుంచే ఏకపక్ష దాడులకు ఎలా సాధ్యమో చంద్రబాబే సమాధానం చెప్పాలి.