ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ, టీడీపీ నేతలు ఢీ అంటే ఢీ అని తలపడేందుకు రోడ్డెక్కారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ ప్రత్యర్థులపై విమర్శలే గొడవకు దారి తీశాయి. పుట్టపర్తిలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైసీపీ ప్రభుత్వం చేసేందేమీ లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై లోకేశ్ విమర్శలు గుప్పించారు.
లోకేశ్ విమర్శలను శ్రీధర్‌రెడ్డి ఖండించారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చివరికి సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణానికి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ సత్యమ్మ గుడిలో ప్రమాణానికి వెళ్లారు.
ఈ విషయం తెలిసి పల్లె రఘునాథరెడ్డి కూడా మందీమార్బలంతో గుడి సమీపానికి వెళ్లారు. అటూఇటూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు మోహరించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి కారు ఎక్కి ప్రత్యర్థులను కవ్వించేలా వ్యవహరించారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. కొంత మంది కొట్టుకున్నారు.
పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి, ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టించేలా నాయకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతల రెచ్చగొట్టే మాటలపై అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారనే హెచ్చరికలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి.