శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం ని మంత్రిగా తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు జగన్ క్యాబినెట్ లో కొనసాగుతున్నారు.
వీరిలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉన్నారు. రెండవ వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన సీదరి అప్పలరాజు. ఆయన మత్య్స పశుసంవర్ధక శాఖలను చూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఫస్ట్ వికెట్ పడిపోయేది సీదరిదే అని టాక్ నడుస్తోంది.
సీదరిని తప్పించడం నూరు శాతం ఖాయమని అంటున్నారు. ఆ ప్లేస్ లో అదే జిల్లా నుంచి మరొకరికి చాన్స్ ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. బీసీ నేతగా, పెద్దాయనగా కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ని మంత్రిగా తీసుకుంటారని అంటున్నారు. తమ్మినేనిని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
తమ్మినేని జగన్ తనకు రాజకీయంగా పునర్జన్మ ప్రసాదించారని ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆయన చివరి సారిగా 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత 2019లో జగన్ వేవ్ లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
చంద్రబాబుకు బద్ధ ప్రత్యర్ధిగా ఘాటైన మాటలతో దాడి చేసే సత్తా ఉన్న నేత. శ్రీకాకుళం జిల్లాలో ఇరవై లక్షల మంది దాకా కాళింగ సామాజిక వర్గం ఉంది. ఉత్తరాంధ్రాలో వారి సంఖ్య ఎక్కువే. దాంతో ఆయనను మంత్రిగా తీసుకుంటే ఉత్తరాంధ్రాలో తమ పట్టు నిలుస్తుందని జగన్ భావిస్తున్నారు.
పైపెచ్చు కింజరాపు ఫ్యామిలీకి గట్టిగా ఎదురునిలిచే నేతగా తమ్మినేనిని చెప్పుకుంటారు. ఇలా చాలా ఈక్వేషన్స్ పనిచేయడంతో తమ్మినేని కాబోయే మినిస్టర్ అంటున్నారు. ఆయనకు కీలకమైన శాఖలనే ముఖ్యమంత్రి అప్పగిస్తారు అని తెలుస్తోంది. స్పీకర్ పోస్ట్ ని ఈసారి దళిత వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ్మినేనికి అపుడే అభినందనలు మొదలవుతున్నాయటే ఆయనే కాబోయే మినిస్టర్ కదా అని అంత అంటున్నారు.