ఓవర్ సీస్ మార్కెట్ మారిపోయింది

ఒకప్పుడు అమెరికాలో సినిమా జనాలు చూడాలంటే పక్కా ఫ్యామిలీ ప్లస్ క్లాస్ సినిమా అయి వుండాలి. త్రివిక్రమ్, సుకుమార్, మహేష్, నాని ఇలాంటి వాళ్ల పేర్లు ఓవర్ సీస్ మార్కెట్ లో హాట్ ఫేవరెట్…

ఒకప్పుడు అమెరికాలో సినిమా జనాలు చూడాలంటే పక్కా ఫ్యామిలీ ప్లస్ క్లాస్ సినిమా అయి వుండాలి. త్రివిక్రమ్, సుకుమార్, మహేష్, నాని ఇలాంటి వాళ్ల పేర్లు ఓవర్ సీస్ మార్కెట్ లో హాట్ ఫేవరెట్ లుగా వుండేవి. ఇప్పుడు కోవిడ్ తరువాత టోటల్ సీన్ మారిపోయింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాల్లో మన స్టూడెంట్ కుర్రాళ్ల సంఖ్య అమాతం పెరిగిపోయింది. ఫస్ట్ జనరేషన్ క్లాస్ ఆడియన్స్ కు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మాస్ ఆడియన్స్ తోడయ్యారు.

అందుకే అఖండ..వీరయ్య..ధమాకా..ఢమ్కీ లాంటి మాస్ సినిమాలు కూడా ఆదరణ పొందుతున్నాయి. రక్తం..హింస వుంటే అమ్మో..భయం అనే అమెరికా తెలుగు ఆడియన్స్ కాదు ఇప్పుడు సినిమాలకు వస్తున్నది. అచ్చంగా మన బి సెంటర్ల ప్రేక్షకులు అమెరికా థియేటర్లలో ప్రత్యక్షమవుతున్నారు. అందుకే అక్కడి థియేటర్లలో కూడా కాగితాలు ఎగురుతున్నాయి. గోల గోల జరుగోతోంది. దీంతో సినిమాల రేట్లు పెరుగుతున్నాయి. నాలుగయిదు కోట్లు రావాలంటే యుఎస్ లో పెద్ద కష్టమైన పనికావడం లేదు ఓ రేంజ్ సినిమాలకు.

తెలుగు సినిమాకు నైజాం పెద్ద మార్కెట్..తరువాత విశాఖ కూడా అదే లెవెల్ లో పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఓవర్ సీస్ తోడవుతోంది. ఒకప్పుడు మహేష్ సినిమా అమెరికా మార్కెట్ 10 నుంచి 12 కోట్లు. ఇప్పుడు 15 కోట్లు పలుకుతోంది. సలార్ ఓవర్ సీస్ రేటు 70 మేరకు డీల్ కుదిరింది. ఇక ప్రాజెక్ట్ కె లు, పుష్ప 2 ఏ మేరకు వుంటాయో.

నిజానికి కోవిడ్ దెబ్బకు ఓవర్ సీస్ బయ్యర్లు కుదేలయ్యారు. అంతకు ముందు కూడా సినిమాలు పెద్దగా ఆడక చాలా మంది దెబ్బతిన్నారు. అది కాక ఫారస్ ఫిలింస్ లాంటి భారీ బయ్యర్లు వచ్చి సింగిల్ పేమెంట్ ఇచ్చి, సినిమాలు తీసేసుకుని మారు బేరం చేయడం మొదలైంది. దీంతో అమెరికా బయ్యర్లు చాలా మంది చేతులు ముడుచుకున్నారు.

కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి చూసి మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నారు. కానీ ఒకటే సమస్య..ఫారస్ ఫిలింస్ లాంటి భారీ పెట్టుబడిదారుతో పోటీ పడాలి అంటే అదే రేంజ్ లో నిధుల సమీకరణ అవసరం. అలా జరగాలంటే ఒకరి వల్ల కాదు. కొత్త సిండికేట్ లు పుట్టుకురావాల్సి వుంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోందని తెలుస్తోంది.