అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్నట్టు అనుకూలవాదులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. చేతిలో మీడియా, డబ్బు ఉంటే… ఏ ఉద్యమాన్ని అయినా సృష్టించొచ్చనేందుకు నిలువెత్తు ఉదాహరణగా అమరావతి పోరు గురించి చెప్పుకోవచ్చు. ఏది ఏమైతేనేం అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని ప్రాంతంలో హడావుడి కనిపించింది.
ఉద్యమానికి సంఘీభావం అంటూ బీజేపీ, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గత ఏడాది నిలిచిపోయిన వెంకటేశ్వరస్వామి దివ్య రథం మళ్లీ అరసవెల్లి వైపు సాగింది. అయితే రాజధాని ప్రాంతంలోనూ, అలాగే దివ్య రథం తిరిగి అరసవెల్లి వైపు కదిలే చోట… ఎక్కడా కూడా ఒక కీలక నాయకుడు కనపించకపోవడం చర్చనీయాంశమైంది. ఆ ముఖ్యమైన నాయకుడే గద్దె తిరుపతిరావు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్‌గా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
పాదయాత్రను ఆగిన ప్రాంతం నుంచి ఈ ఏడాది జనవరి 11న తానొక్కడిగానే ప్రారంభించారు. శ్రీకాకుళంలోని అరసవెల్లికి నడుస్తూ వెళ్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. తద్వారా అమరావతిపై తన నిబద్ధతను చాటుకున్నారు. 1200 రోజులు పూర్తి చేసుకున్న ఉద్యమంలో ఆయన పాల్గొన్నట్టు ఎక్కడా ఫొటోలు, ఇతరత్రా ఆనవాళ్లు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో దఫా పాదయాత్రపై అమరావతి జేఏసీలో లుకలుకలున్నాయనే గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. బహుశా విభేదాల వల్లే తిరుపతిరావు వీళ్లకు దూరంగా ఉన్నారేమో అనే చర్చకు తెరలేచింది.