బీజేపీ కంటే సత్యకుమార్ ఏమైనా తోపా?…ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. రాజధాని ప్రాంతంలో నిన్న బీజేపీ, మూడు రాజధానుల అనుకూలవాదుల మధ్య గొడవ జరిగింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సత్యకుమార్‌పై దాడి అంటూ బ్యానర్ కథనాలను ప్రచురించడాన్ని గమనించొచ్చు. వ్యక్తిగా సత్యకుమార్‌ను హైలెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఏపీ బీజేపీ నేతలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
బీజేపీ కంటే సత్యకుమార్ గొప్ప అనే రీతిలో ఎల్లో మీడియా కథనాలు రాసుకొచ్చింది. అసలు బీజేపీ లేకపోతే… సత్యకుమార్ ఎవరు? అనే ప్రశ్న వేసుకుంటే… సున్నా అనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ వ్యవహరిస్తున్నారు. సత్యకుమార్‌పై దాడి అని క్రియేట్ చేయడం ద్వారా, బీజేపీ ఆగ్రహానికి వైసీపీ సర్కార్ గురవుతుందనే చిన్న ఆశ ఎల్లో మీడియా కథనాల్లో ప్రతిబింబించింది.
నిన్నమొన్నటి వరకూ సత్యకుమార్ అంటే ఎవరో బీజేపీ శ్రేణులకే తెలియని పరిస్థితి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్‌కు అదృష్టం కలిసొచ్చి, బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. తాను ఎదుగుతూ ఏపీలో బీజేపీని పాతరేశారనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఏపీలో టీడీపీ, ఢిల్లీలో బీజేపీ అనే రీతిలో సత్యకుమార్ రాజకీయ పంథా వుంటుందని సొంత పార్టీల నేతలే ఆరోపిస్తున్న పరిస్థితి. అందుకే సత్యకుమార్‌కు సంబంధించి తాజా ఘటనను ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోందనే చర్చ జరుగుతోంది.
ఇదే ఎల్లో మీడియా బీజేపీ నేతలందరి విషయంలో ఒకే రకంగా చూడని సంగతిని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇవాళ సత్యకుమార్‌పై దాడి అంటూ రాసుకొచ్చిన వీకెండ్స్ జర్నలిస్టు పత్రిక…ఏపీ బీజేపీ అధ్యక్షుడి పేరు రాయడానికి కూడా ఇష్టపడని విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేసే బీజేపీ నేతలను తమ వాళ్లగా భావిస్తూ, వైసీపీని హెచ్చరించడానికి ప్రయోగిస్తుంటారనే చర్చ నడుస్తోంది. సత్యకుమార్‌పై వైసీపీ దాడి చేసిందనే ప్రచారాన్ని ఉధృతంగా సాగించి, కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసే వ్యూహంలో భాగంగానే ఈ ఘటనను వాడుకునే ప్రయత్నం ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.