కొత్తగా రాబోయేదేం లేదు.. అప్పీలు చేయొచ్చు!

తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన వైనం.. వయనాడ్ దొరగారికి బాగానే కలిసి వచ్చింది. ఈ పది రోజులుగా భారతీయ జనతా పార్టీని, కేంద్రప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని రకరకాలుగా ఆడిపోసుకుంటున్నారు. రాహుల్ నుచూసి భయపడిపోయినట్లుగా, వణుకుతున్నట్టుగా కూడా…

తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన వైనం.. వయనాడ్ దొరగారికి బాగానే కలిసి వచ్చింది. ఈ పది రోజులుగా భారతీయ జనతా పార్టీని, కేంద్రప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని రకరకాలుగా ఆడిపోసుకుంటున్నారు. రాహుల్ నుచూసి భయపడిపోయినట్లుగా, వణుకుతున్నట్టుగా కూడా చాటుతూ వచ్చారు. 

మోడీని, బిజెపిని ఎన్ని రకాలుగా తిట్టవచ్చునో అన్ని రకాలుగానూ తిట్టారు. ఎంత మైలేజీ రాగలదో.. అంత మైలేజీ రాబట్టుకున్నారు. ఇక కొత్తగా వచ్చే మైలేజీ ఏమీ లేదని అర్థమైపోయినట్టుంది. అందుకే ఇప్పుడిక తనకు పడిన జైలు శిక్ష గురించి పైకోర్టులో అప్పీలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 

మార్చి 23న మోడీ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ పరువునష్టం దావాలో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి 30 రోజుల్లోగా ఆ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి ఆయనకు అనుమతి కూడా ఇచ్చింది. ప్రజాప్రతినిధులకు రెండేళ్లు, అంతకుమించి పడే జైలుశిక్షల విషయంలో చట్టం ఎలా ఉన్నదో దానికి తగినట్టుగా తీర్పు వచ్చిన రోజునుంచే ఆయనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ పార్లమెంటు సెక్రటేరియేట్ నిర్ణయం తీసుకుంది. ఆయన వయనాడ్ స్థానాన్ని ఖాళీగా కూడా చూపించేసింది. 

కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే.. ఆ నిర్ణయం ఫైనల్ కాదు. పార్లమెంటు సెక్రటేరియేట్ టెక్నికల్ కారణాల రీత్యా అలా చూపించినప్పటికీ.. గతంలో ఉన్న ప్రతికూల అనుభవాలను బట్టి ఎన్నికల సంఘం ఆ స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే రాహుల్ పైకోర్టుకు అప్పీలుకు వెళ్లి, ఆ తీర్పుపై స్టే తెచ్చుకుంటారా లేదా చూడాలని ఆగింది. 

నిజానికి, పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడం అనేది కేవలం సాంకేతికమైన అంశం. అయితే దీనినుంచి రాజకీయ మైలేజీ పిండుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అదేపనిగా రాహుల్ ను చూసి జడుసుకుంటున్నట్టుగా విమర్శలు చేస్తూ వచ్చింది గానీ.. పైకోర్టులో అప్పీలును జాప్యం చేసింది. తీరా దాదాపు పదిరోజుల తర్వాత వచ్చిన మైలేజీ చాలనుకున్నారేమో.. ఇప్పుడు సూరత్ కోర్టు తీర్పుపై అప్పీలు చేయడానికి రాహుల్ న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారట. 

నిజానికి వారికి అప్పీలుకు ఇంకా ఇరవైరోజుల గడువు ఉంది. అప్పీలు చేసి.. సూరత్ కోర్టు తీర్పుపై స్టే రాబట్టుకోగలిగితే.. ఆటోమేటిగ్గా రాహుల్ ఎంపీ పదవి పునరుద్ధరణ జరుగుతుంది. బహుశా అప్పుడు పెద్దగా చర్చ జరగక పోవచ్చు. 24 వ తేదీన అప్పీలకు వెళ్లి ఉండినా కూడా రాహుల్ కు స్టే తప్పనిసరిగా వచ్చి ఉండేది. కాకపోతే ఇంత రాద్ధాంతం ఉండేది కాదు.