ఆకాశాన్నంటుతున్న డిజిటల్ రేట్లు

సినిమాలకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ రేట్లు అన్నవి భారీ ఆసరాగా కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే డిజిటర్ స్ట్రీమింగ్ రేట్లు ప్లస్ మిగిలిన నాన్ థియేటర్ ఆదాయంతోనే మొత్తం నిర్మాణ వ్యయం వెనక్కు తెచ్చుకునే…

సినిమాలకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ రేట్లు అన్నవి భారీ ఆసరాగా కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే డిజిటర్ స్ట్రీమింగ్ రేట్లు ప్లస్ మిగిలిన నాన్ థియేటర్ ఆదాయంతోనే మొత్తం నిర్మాణ వ్యయం వెనక్కు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే అలా అని అన్ని సినిమాలకు ఈ పరిస్థితి లేదు. క్రేజీ కాంబినేషన్ వుంటేనే ఇది సాధ్యమవుతోంది.  

ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రేట్ల బేరాలు వింటుంటే షాక్ కొట్టినట్లే వుంటుంది. కానీ గమ్మత్తేమిటంటే నాన్ థియేటర్ రేట్లు పెరుగుతున్న కొద్దీ హీరోల రెమ్యూనిరేషన్లు, సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతూ పోవడం. అంటే రేట్లు వస్తున్నాయన్న సంబరమే తప్ప నిర్మాతకు మిగిలేది మళ్లీ అదే పాత లెక్కలే.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ పుష్ప 2 డిజిటల్ రేట్ ను 200 కోట్ల దగ్గర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కేజిఎఫ్ 2, షారూఖ్ ఖాన్ పఠాన్ కన్నా ఇది చాలా అంటే చాలా ఎక్కువ. అందుకే నెట్ ఫిక్స్ సంస్థ బేరసారాలు సాగిస్తోంది. 150 నుంచి 160 దగ్గర అయితే ఫైనల్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు-త్రివిక్రమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కలు అత్యంత భారీగా 80 కోట్ల కు అటు ఇటు చేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అంతే కాదు డిజె టిల్లు 2 డిజిటల్ రైట్స్ కూడా భారీగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సలార్..ప్రాజెక్ట్ కే లాంటి భారీ సినిమాల డిజిటల్ రైట్స్ అంటూ వినిపిస్తున్న మొత్తాలు భారీగా వున్నాయి. నిజమేనా అనేంతగా రేట్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే హరీష్ శంకర్-మైత్రీ-పవన్ సినిమా డిజిటల్ రైట్స్ ఎప్పుడొ జమానా కాలం నాడు నిర్మాతలు విక్రయించేసినట్లు తెలుస్తోంది. మరో రెండు చిన్న సినిమాలతో కలిపి జస్ట్ 20 కోట్లకే ఇచ్చేసారని టాక్. అదే ఇప్పుడు అయి వుంటే అన్నీ కలిసి అంతకు రెండింతలు పైగా వచ్చి వుండేది.

ఇటీవల దసరా సినిమాకు నాన్ థియేటర్ హక్కులు యాభై కోట్ల వరకు వచ్చి, నిర్మాతను చాలా వరకు ఆదుకున్నాయి.

రంగమార్తాండ సినిమాకు 11 కోట్ల వరకు ఖర్చయితే డిజిటల్ హక్కులే ఆరు కోట్లకు పైగా వచ్చి నిర్మాతను కాస్త నిలబెట్టాయి.