ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆ రాష్ట్ర శాసనమండలిని చేరుకుంది. అసెంబ్లీలో తిరుగులేని బలంతో ఈ బిల్లును ఆమోదింపజేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలి లో మాత్రం మెజారిటీ లేదు. ఆ పార్టీకి కేవలం 9 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం కష్టంగా ఉంది.
అయితే ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకు ప్రిపేర్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. మండలిలో తెలుగుదేశం పార్టీకి తిరగులేని బలం ఉంది. దీంతో అక్కడ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కొందరు గైర్హాజరు అయిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఉన్న సమాచార మేరకు కొంతమంది ఎమ్మెల్సీలు మండలికి హాజరు కాలేదని తెలుస్తోంది. అలాగే బీజేపీ సభ్యులు కూడా ఒకరు గైర్హాజరు అయినట్టుగా సమాచారం. ఇక మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరు మంది ఉన్నారు. వారు మూడు రాజధానుల ఫార్మాలకు అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదు. స్వతంత్రులు ముగ్గురు, కాంగ్రెస్ సభ్యులు ఒకరున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనీసం పదిమంది ఎమ్మెల్సీలు గైర్హాజరు అయితే తప్ప మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉండవు.
అయితే ఈ రోజు మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే, రేపు అసెంబ్లీలో మరోసారి ఆమోదించి మండలికి పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమోదం పొందకపోయినా కొన్ని నెలల్లో ఈ బిల్లు చట్టం అయ్యే అవకాశం ఉంది.
ఈ పరిణామాల్లో వైసీపీ ముఖ్య నేతలు మండలి గ్యాలరీల్లో కనిపించడం గమనార్హం. వి.విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు శాసనమండలి వీఐపీ గ్యాలరీల్లో ఉన్నారు. ఇంతలోనే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసినట్టుగా ప్రకటన వస్తోంది. ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా సమాచారం.