పాపం… పీటవేసిన వారు కూడా జారిపోయే..!

చంద్రబాబునాయుడు… సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకుని సేవ చేసేవారికి కాకుండా, అడ్డ దారిలో పార్టీలోకి వచ్చిన వారిని కూడా… తన అవసరం కోసం నెత్తిన పెట్టుకునే వైఖరిని అనుసరిస్తూ ఉంటారు. అలాగని.. అలా వచ్చిన…

చంద్రబాబునాయుడు… సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకుని సేవ చేసేవారికి కాకుండా, అడ్డ దారిలో పార్టీలోకి వచ్చిన వారిని కూడా… తన అవసరం కోసం నెత్తిన పెట్టుకునే వైఖరిని అనుసరిస్తూ ఉంటారు. అలాగని.. అలా వచ్చిన వారు.. చంద్రబాబు తమకు పెద్దపీట వేసినంత మాత్రాన ఆయనపట్ల కృతజ్ఞతతో ఉంటారనుకోవడం భ్రమ. తాజాగా చంద్రబాబుకు అలాంటి ఎదురుదెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. పార్టీలోకి దొడ్డిదారిలో వచ్చి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్.. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం మంగళవారం నాడు శాసనమండలి ఎదుటకు వచ్చింది. కాకపోతే.. మండలిలో తమకు మెజారిటీ ఉండడంతో.. ఈ బిల్లును తిప్పికొట్టాలని తెలుగుదేశం వ్యూహరచన చేసింది. వారికే ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సభకు హాజరు కాలేదు. పైగా, ఆయన తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు అమరావతి వర్గాల్లో వినిపిస్తోంది. డొక్కా గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు కూడా.

డొక్కా గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు మాజీఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరుడిగా ముద్ర ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రాయపాటి తనకున్న సంబంధాలతో తెదేపాలో చేరారు. ఆ తర్వాత చాలా కాలానికి గురువుబాట అనుసరించి డొక్కా కూడా వచ్చారు. రాయపాటి ఒత్తిడితోనే.. కాంగ్రెసు నుంచి వచ్చి నాయకుడు అయినప్పటికీ… డొక్కాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. పార్టీలోని సీనియర్లు అనేక మంది నిరీక్షిస్తున్నా చంద్రబాబు పదవి కట్టబెట్టారు.

ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో.. పలువురు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి గానీ.. వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని చంద్రబాబు తన కొడుకు లోకేష్, డొక్కా వంటి వారికి మాత్రం రాజీనామా కండిషన్ పెట్టలేదు. దానికి తగ్గట్లుగానే వారు ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. చంద్రబాబు ఇలా అడ్డదారిలో వచ్చిన డొక్కాను నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి. అయినప్పటికీ.. ఆయనకు మాత్రం చంద్రబాబుపై సానుభూతి, దయ, జాలి లేకుండా పోయాయి.

రాజధానుల బిల్లును తిప్పికొట్టదలచుకున్న కీలకమైన రోజున ఆయన గైర్హాజరు కావడమూ, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడమూ తెలుగుదేశానికి షాక్ అనే చెప్పాలి.

అందరి పేర్లు బయట పెట్టి వణికించిన బుగ్గన