cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

'సరిలేరు'..నాన్నా పులి కథ

'సరిలేరు'..నాన్నా పులి కథ

మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదలయింది. ఎంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 90శాతం థియేటర్లలో ఈ సినిమానే విడుదలయింది. పైగా అర్థరాత్రి దాటిన తరువాత నుంచి షో లే షో లు. అప్పటికే సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. జనం థియేటర్లకు పరుగులు పెట్టారు. భయంకరమైన ఫిగర్ తొలిరోజే కనిపించింది. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే రెండు ఫైట్లు, రెండు పాటల్లో డ్యాన్స్ లు, హీరో ఎలివేషన్ సీన్లు వాళ్లకి ఫుల్ మీల్సే.

సరే, సినిమా ఎలా వుంది? టాక్ ఎలా వుంది? అన్న రకరకాల ఫ్యాక్టర్లను పక్కన పెడితే సినిమాకు మాంచి కలెక్షన్లు పండగ రోజుల వరకు డ్రాప్ కాకుండా వస్తూనే వున్నాయి. ఇప్పటికీ షేర్ వస్తూనే వుంది. ప్రతి చోటా బయ్యర్లు హ్యాపీగానే వున్నారు.

కానీ సరిలేరు సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు వచ్చింది? 

సరిలేరు సినిమాకు తొలి సమస్య అత్యుత్సాహం. కొందరి అత్యుత్సాహం. తొలిరోజునో, మలిరోజునో రికార్డు చూపించాలనో, అలాగే తమ హీరో అవతలి హీరోకన్నా ఎక్కువ అనిపించాలనో, ఇలాంటి అత్యత్సాహంతో ఎవరికి తోచిన ఫిగర్లు వాళ్లు సర్క్యులేట్ చేసారు. ఆ ఫిగర్లలో కొన్ని కరెక్ట్ వుండొచ్చు. కొన్ని టెక్నికల్ గా కరెక్ట్ వుండొచ్చు. మరికొన్ని అత్యుత్సాహానికి నిదర్శనంగా వుండొచ్చు. 

దీనివల్ల ఏమయింది. సరిలేరు ఫిగర్లు కరెక్ట్ కాదన్న హడావుడి ప్రారంభమైంది. సోలోగా వచ్చి వుంటే ఎలా వుండేదో కానీ, పోటీగా మరో సినిమా వుండడంతో, అటుకూడా ఫ్యాన్ బేస్ బలంగా వుండడం, అటు కూడా సోషల్ మీడియా మేనేజ్ మెంట్ బలంగా వుండడంతో ఫైట్ ప్రారంభమైంది. దీంతో నిజమైన ఫిగర్లు ఏవో, కానివి ఏవో అన్న కన్ ఫ్యూజన్ విపరీతంగా నెలకొనే పరిస్థితిని తీసుకువచ్చారు. 

నిజానికి సరిలేరు యూనిట్ ఈ సమయంలో టోటల్ గా సైలంట్ గా వుండడమో, లేదో, ఫ్యాన్స్ ను, ట్రోలర్స్ ను కట్టడి చేసి, తమ వైపు నుంచి మాత్రమే అధికారికంగా సరైన ఫిగర్లు మాత్రమే వదలడమో చేసి వుండాల్సింది. అలా జరగడానికి బదులు, కలెక్షన్ కార్డులు వదిలారు. దీంతో రచ్చ మరింత ముదిరింది. నిజంగానే అల వైకుంఠపురములో కలెక్షన్లు 10శాతమో, ఇరవై శాతమో సరిలేరు కన్నా ఎక్కువ వున్నాయి. కానీ అలా అని సరిలేరు షేర్ రాకపోవడం, లేదా బయ్యర్లు కుదేలయిపోవడం జరగలేదు.

కానీ ఇప్పుడు ఏమయింది. టోటల్ గా సరిలేరు ఫిగర్లు ఫేక్ అనో, లేదా అసలు బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కాలేదనో అనేంతంగా వ్యవహారం తయారైంది. ఇప్పటికీ అంటే 10రోజలకు కూడా ఇంకా శుభ్రంగా షేర్ వస్తోంది. ఆ మాటకు వస్తే చాలా చోట్లు ఈ రెండు సినిమాలకే కాదు, దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలకు కూడా ఇంతో అంతో షేర్ వస్తోంది. కానీ ఈ హడావుడి ముందు సరిలేరు అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనేలా ప్రచారం వచ్చేసింది.

నిజానికి సరిలేరు సినిమాను తెలుగు నాట 75 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. అంటే ఇక్కడ 80 కోట్లు దాటితే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే.  అమెరికాలో రెండు మిలియన్లు వస్తే చాలు. అదీ జరిగింది. మహేష్ కు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు రెండు మిలియన్లు దాటినవి వచ్చాయి. అలాగే శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా నాలుగు హిట్ లు ఒకే వరుసలో వచ్చాయి. దీనికి తోడు సంక్రాంతి వెళ్లిన తరవాత నాచురల్ గా కలెక్షన్లు డౌన్ అయినా షేర్ వస్తోంది. 

కానీ ఇవన్నీ ఎవరికీ పట్టడం లేదు. ఫేక్ ఫిగర్స్ అన్న ప్రచారం మాత్రమే మిగిలిపోయింది. దీనికి కారణం, ఇలా సినిమా వస్తూనే, అలా ప్రారంభించేసిన హడావుడి తప్ప వేరు కాదు. 

నిజంగా ఇఫ్పుడు షేర్ వస్తున్నా, ఆరంభంలో నమ్మశక్యం కానీ వ్యవహారాలు చేయడంతో, ఇప్పుడు నమ్మకుండా అయిపోయింది. నాన్నా పులి కథ అంటే ఇదేగా. ముందు అబద్దం ఆడినా నమ్ముతారు. తరువాత నిజం చెప్పినా నమ్మరు. పోటీ పోటీగా సినిమాలు వస్తున్నపుడు ఇకపైనైనా కాస్త జాగ్రత్తగా వుంటే నెగిటివ్ స్ప్రెడ్ కాకుండా వుంటుందేమో?

రాజ్ డిస్కో రాజ్ ​