ఈ చెత్త లాజిక్కులు టీడీపీకే చెల్లుతాయా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయింది.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కింది. ఇప్పుడు రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేశారు.. కాబట్టి, మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయింది.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కింది. ఇప్పుడు రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేశారు.. కాబట్టి, మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనంటున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు. చాలా చిత్రమైన సందర్భమిది. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? ఆ పార్టీ అధినేత, తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెచ్చే స్థితిలో వున్నారా.? ఇవేమీ టీడీపీ నేతలు ఆలోచించడంలేదు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అదనపు అడ్వాంటేజ్‌ని తెచ్చిపెడుతుంది. 

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పుంజుకునే పరిస్థితే లేదు. అమరావతి చుట్టూ ఇంత యాగీ జరుగుతున్నా, కృష్ణా – గుంటూరు జిల్లాల్లో మెజార్టీ భాగం ఆ ఆందోళనల్ని పట్టించుకోవడంలేదాయె. ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిస్థితి ఇంకోలా వుంది.

నిజానికి, సీనియర్‌ పొలిటీషియన్‌గా అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు, పాలనా వికేంద్రీకరణని టీడీపీ అధినేత చంద్రబాబు సమర్థించి వుండాల్సింది. పోనీ, ప్రతిపక్ష నేత గనుక సమర్థించలేకపోతే.. యాగీ చేయడం కాస్త తగ్గించి వుండాలి. కానీ, అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.? టీడీపీలోనే చాలామంది నేతలు చంద్రబాబు తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు పైకి చెప్పలేకపోతున్నా, లోలోపల చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతతో కన్పిస్తున్న మాట వాస్తవం.

అమరావతిలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్‌లు.. ఈ క్రమంలో సినీ డైరెక్టర్లతో జరిపిన మంతనాలు.. ఇవన్నీ చూశారు ప్రజలు. అందుకే, ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం  ఎదురయ్యింది. రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబుకి చుక్కెదురయ్యిందంటే.. ఆ తర్వాత ఆయన పరిస్థితుల్ని సమీక్షించుకోవాలి కదా.!

'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు..' అంటూ చంద్రబాబు నినదిస్తున్నారిప్పుడు. జరగాల్సింది జరిగిపోతోంది. చంద్రబాబుకి ఆ ప్రక్రియని ఆపేంత సమర్థత, శక్తి.. రెండూ లేవు. ఇంకా ఒకటే నినాదం పట్టుకుంటే.. చివరికి 13 జిల్లాల పార్టీ స్థాయి నుంచి 29 గ్రామాల స్థాయికి టీడీపీ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందరి పేర్లు బయట పెట్టి వణికించిన బుగ్గన