ఐదేళ్ల నుంచి దాన్ని తాత్కాలిక అసెంబ్లీ అని ప్రచారం చేశారు, అదే ఐదేళ్ల నుంచి అమరావతిలో కట్టింది తాత్కాలిక సెక్రటేరియట్ అనే అన్నారు.. అయితే ఉన్నఫలంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కొత్త విషయం చెప్పారు. అదేమిటంటే.. ఆ అసెంబ్లీ తాత్కాలికం కాదట! చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయగానే.. అసెంబ్లీ ఒక్కసారిగా భళ్లుమంది!
దాని నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి .. అది తాత్కాలికం అంటూ వ్యవహరించారు. అది అసలుది కాదని, అసలుది వేరే అని, ప్రస్తుతానికి- తాత్కాలికానికి వెయ్యి కోట్లతో అసెంబ్లీ, మరో వెయ్యి కోట్లతో సెక్రటేరియట్ కట్టినట్టుగా ప్రచారం చేశారు. దాని నాణ్యత ఏమిటో అప్పట్లోనే స్పష్టం అయ్యింది. చిన్నపాటి వర్షానికే ఆ సచివాలయం కారి డొల్లతనాన్ని బయటపెట్టింది.
అక్కడకూ కొంతమంది సర్దుకుపోయారు. అదేమంటే అది తాత్కాలికం అంటున్నారు కాబట్టి.. అలా కట్టారేమో అనుకున్నారు. అయితే ఆ అసెంబ్లీ తాత్కాలికం కాదు అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సెలవిచ్చారు. ఆ మాట అనగానే వైసీపీ వాళ్లు గట్టిగా నవ్వారు. దీంతో చంద్రబాబుకు రోషం పొడుచుకువచ్చినట్టుగా ఉంది.
తను వేరే అసెంబ్లీ కడతాను అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఐకానిక్ టవర్స్ గా వేరే అసెంబ్లీని కడతామని అన్నట్టుగా చెప్పారు. అయితే అది మాత్రం తాత్కాలిక అసెంబ్లీ కాదని.. తాను చెప్పింది ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మొత్తానికి అమరావతి విషయంలో ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం వెనుకాడటం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.