ధర్మం ఒక్కటే ఉంటుంది. అది రాజ మార్గంలోనే కనిపిస్తుంది. రాజు ఎపుడు ధర్మం తప్పకూడదు. అపుడెపుడో ఈ మాటలు దేశం మొత్తం విన్నది. అదీ వరిష్ట నేత, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వంటి రాజనీతి కోవిదుడు నోటి వెంట వచ్చిన మాటలు అవి, రాజధర్మం గురించి బాగా నాడు వాజ్ పేయ్ వివరించారు. ఈ సలహా ఎవరికి చెప్పారంటే ఇప్పటి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి. గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో రాజధర్మం గుర్తు చేయాల్సివచ్చింది.
మళ్ళీ ఇన్నాళ్ళకు ఏపీ అసెంబ్లీలో రాజధర్మం, రాజ్యాంగ ధర్మం గురించిన చర్చ వచ్చింది. సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీనిమీద చక్కని ప్రసంగం చేశారు. పాలకుడు ఏం చేయాలి. ఏం చేయకూడదు అంటూ నాటి బాబుని, నేటి జగన్ని ముందు పెట్టి పోలిక తెచ్చి చూపించారు.
రాజ్యాంగ ధర్మాలను అన్నీ యధేచ్చగా ఉల్లఘించి మరీ అమరావతి రాజధాని నిర్మాణం బాబు చేపట్టారని ధర్మాన ఆక్షేపించి ఊరుకోలేదు, సహేతుకమైన అంశాలను కూడా ఆధారసహితంగా ప్రస్తావించారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను ఎలా తోసిపుచ్చిందీ, రాజధాని అయిదు కోట్ల ప్రజలకు ఎలా కాకుండా చేసిందీ ధర్మాన వివరించారు. అంతే కాదు, కోర్టు తీర్పులను సైతం పక్కన పెట్టడం, పర్యావరణ ధర్మాలను సైతం కాలదన్ని పచ్చని పొలాలను తీసుకోవడం ద్వారా బాబు పూర్తిగా తాను అనుకున్నదే చేసారని ఆయన ఆరోపించారు.
వెనకబడిన ప్రాంతాల గొంతులు ఏవీ అడవవని అన్యాయం చేయడం పాలకులకు తగునా అంటూ ధర్మాన ధర్మంగా నిలదీసినపుడు బాబు ఇబ్బందులే పడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను భోగీ మంటల్లో వేస్తారా అంటూ ధర్మాన అడిగిన సూటి ప్రశ్నకు కూడా జవాబు లేదు.
అమరావతి కోసం మాత్రమే ఎందుకు జోలె పట్టాల్సివచ్చింది. ఏం మళ్ళీ ఉత్తరాంధ్రా, రాయలసీమ మీరు రారా, మా ఓట్లు అక్కరలేదా అంటూ ఆయన సంధించిన బాణాలకు బాబుతో సహా టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొత్తానికి ధర్మాన ధర్మం పసుపు పార్టీ గాలి తీసేసింది. వైసీపీలో మాట్లాడిన వక్తల్లోకెల్లా ధర్మాన స్పీచ్ అదుర్స్ అన్న మాట కూడా వినిపించింది.